రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి విమర్శించారు. సీఎం పదవిని కించపరిచేలా మాట్లాడిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రాబోయే ఎన్నికల్లో తెరాసకు గుణపాఠం : తల్లోజు ఆచారి
రాష్ట్రంలో ప్రజా సమస్యలను సీఎం కేసీఆర్... ఏమాత్రం పట్టించుకోవడం లేదని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. యాదాద్రి భుననగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రంలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తేనో, లేదా ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతేనో ఆ నియోజకవర్గ వర్గానికి వరాలు ఇచ్చే స్థితికి కేసీఆర్ చేరుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఉండగానే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్‌ను సీఎం చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తెరాసకు గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.