తెలంగాణ

telangana

ETV Bharat / state

'అభివృద్ధిలో అందరికి ఆదర్శంగా నిలుస్తాం' - thirty days action plan

పల్లెల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందన్న మహనీయుల కల నిజం చేసేందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామాలన్నీ నడుం బిగించాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల కార్యచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేసి తమ ఊళ్లను ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నాయి.

ఆదర్శ గ్రామం

By

Published : Oct 4, 2019, 3:17 PM IST

ఆదర్శ గ్రామం

పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ 30 రోజుల కార్యచరణ ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మలరామారం మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామాన్ని మోడల్​ విలేజ్​గా రూపొందించేందుకు అధికారులు ఎంపిక చేశారు. యాదాద్రి జిల్లాలో గతేడాది ప్రత్యేక పంచాయతీగా ఏర్పడిన మైసిరెడ్డిపల్లి గ్రామం 30 రోజుల ప్రణాళికలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. 80 శాతం పారిశుద్ధ్య పనులు పూర్తిచేసింది.

కలిసికట్టుగా కృషి

ఈ కార్యక్రమంలో భాగంగా... గ్రామస్థులంతా కలిసి స్వచ్ఛందంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తొలగించారు. పాత విద్యుత్​ స్తంభాలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. చెత్తాచెదారాన్ని తొలగించి వీధులను పరిశుభ్రంగా మార్చారు. హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. గ్రామసభలు ఏర్పాటు చేసుకుని ప్రణాళిక ప్రకారం ఊరంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. తమ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.

అభివృద్ధిలో ఆదర్శమవుతాం

గ్రామ పరిసరాల్లో 10 గుంటల భూమిని డంపింగ్ యాడ్ కొరకు వినియోగిస్తున్నారు. భూగర్భ జలాల స్థాయి పెంచేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నారు. మురికి కాల్వలు తొలగించి అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణ పనుల ప్రణాళిక రూపొందించారు. వీధుల్లో మిగిలి ఉన్న సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు సర్పంచ్ రమాదేవి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటివరకు గ్రామంలో 80 శాతం పారిశుద్ధ్య పనులు పూర్తి చేసి పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని వెల్లడించారు. మోడల్ విలేజ్​గా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేసిన తమ గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుస్తామని పేర్కొన్నారు.

మండలంలోనే అగ్రస్థానం

30 రోజుల కార్యచరణ ప్రణాళిక అమల్లో ముందంజలో సాగుతున్న తాము.. దసరా పండుగ నాటికి తమ గ్రామాన్ని మరింత అందంగా ముస్తాబు చేస్తామని తెలిపారు. అభివృద్ధిలో మండలంలోనే అగ్రస్థానంలో నిలిచి అందరికీ ఆదర్శప్రాయమవుతామని మైసిరెడ్డిపల్లి గ్రామస్థులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details