MUSI RIVER FLOOD: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. అధిక ప్రవాహంతో భువనగిరి మండలం బొల్లేపల్లి, వలిగొండ మండలం సంగెం గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండురోజులుగా ఉగ్రరూపం దాల్చిన మూసీ ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టింది.
చౌటుప్పల్‌తో పాటు పరిసర ప్రాంత ప్రజలు జిల్లాకేంద్రమైన భువనగిరి చేరుకోవడానికి భీమలింగం లోలేవల్ వంతెన చాలా దగ్గరి మార్గం కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా వాహనదారులు, ప్రజలు ఈ మార్గంలో ప్రయాణించకుండా పోలీసులు భారీకేడులు ఏర్పాటు చేశారు. వరద ప్రభావంతో చౌటుప్పల్ ప్రాంత వాసులు నాగారం, వలిగొండ మీదుగా చుట్టూ తిరిగి చాలాదూరం ప్రయాణించాల్సి వస్తోంది. మరోవైపు మూసీ వరదలో గుర్రపు డెక్క కొట్టుకొని వచ్చి వంతెన వద్ద భారీగా పేరుకుపోయింది. ఈరోజు రేపు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ పరిసరాల్లో వర్షం కురిస్తే వరద మరింత పెరిగే అవకాశం ఉంది.