Munugode by poll campaign: మునుగోడు ఉపఎన్నికలో తెరాస ప్రచారం జోరుగా సాగుతోంది. గడగడపకూ వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు తమ పార్టీ అభ్యర్థికే ఓటువేయాలని అభ్యర్థిస్తున్నారు. నాంపల్లి మండల కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుపై ఓటువేసి.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. నాంపల్లి మండలం పసునూరులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస సర్కార్ తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరించారు. ఎమ్మెల్సీ తాతా మధు పంటచేల్లోకి వెళ్లి మరీ రైతులను కలుసుకుని... తెరాసకే ఓటేయాలని అభ్యర్థించారు.
మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరుఫున ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఇరవర్తి అనిల్ కుమార్ చండూర్ పురపాలికలో గడప గడపకూ కాంగ్రెస్ నినాదంతో ప్రచారం నిర్వహించారు. ఆడబిడ్డను గెలిపించి.. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో తెరాస, భాజపాలు మునుగోడులో చేసిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు.
గడిచిన ఎనిమిదేళ్లలో తెరాస, భాజపాలు మునుగోడులో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టలేదని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విమర్శించారు. ఉపఎన్నికల్లో ఆడబిడ్డను గెలిపించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఓటర్లను అభ్యర్థించారు. చండూర్ పురపాలికలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో ప్రచారం నిర్వహించారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరుపున ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.
మహిళా సంఘాలకు కేంద్రం ప్రభుత్వం నిధులు ఇచ్చినా.. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడం లేదని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని గొల్లకురుమలకు చెక్కులు ఇచ్చారన్న ఆయన వాటిని ఎందుకు విడుదల చేసుకునే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో ప్రచారంలోని ఈటలరాజేందర్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి రాజ్ గోపాల్ రెడ్డికే ఓటు వేయాలని స్థానికులను కోరారు.