తెలంగాణ

telangana

ETV Bharat / state

మునుగోడు ఉపఎన్నిక జాతర వచ్చే.. ఓటర్లకు పండుగ తెచ్చే..!! - మునుగోడు ఉపఎన్నిక తాజా వార్తలు

Munugode by election: తారలు దిగివస్తున్నారు. నేతలు నడిచొస్తున్నారు. తెల్లవారిందంటే చాలూ.... మోత మోగే మైకులు... హోరెత్తే నినాదాలు. టీవీల్లో కనిపించే వారంతా వాకిళ్లలో ప్రత్యక్షమవుతున్నారు. పొలాల బాట పట్టే జనం ప్రచార బాట పడుతున్నారు. రాష్ట్రంలో కీలకంగా మారిన ఉపఎన్నిక వేళ మునుగోడు గ్రామాల్లో నెలకొన్న సందడి అంతా ఇంతా కాదు. జోరుగా చేరికలు, దావత్‌లు, ఆత్మీయ వేడుకలతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ తమతోనే అభివృద్ధి సాధ్యమంటూ పార్టీల నేతలు ప్రచారాలు సాగిస్తున్నారు.

munugode election
మునుగోడు ఉపఎన్నిక

By

Published : Oct 20, 2022, 10:59 PM IST

Munugode by election: అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో ఉండే సందడంతా ఇప్పుడు మునుగోడులో కనిపిస్తోంది. అన్ని పార్టీలకు చెందిన రాష్ట్ర, జిల్లాల స్థాయి నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గంలోనే మకాం వేశారు. ఒక్కో మండలాన్ని, గ్రామాన్ని బాధ్యతగా తీసుకుని.... తమ అభ్యర్థుల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. సాధారణ రోజుల్లో నిశబ్దంగా ఉండే పల్లెల్లో.... ఉపఎన్నిక ప్రచారహోరుతో కోలాహాలం నెలకొంది. ఇప్పటికే ఒక దపాగా అగ్ర నేతల పర్యటనలు పూర్తికాగా... పోలింగ్‌ దగ్గర పడే సమయానికి ప్రచారంతో హోరెత్తించి, రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎవరికి వారు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

తెరాస నాయకుల జోరు ప్రచారం.. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి మునుగోడువ్యాప్తంగా మోహరించిన అధికార పార్టీ నేతలు తమ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపు కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా అధినేత బహిరంగసభ, కేటీఆర్​ ప్రచారం ముగియగా, పోలింగ్‌నాటికి మరోసారి కేసీఆర్‌ ప్రచారంలో పాల్గొనేందుకు గులాబీదళం ఏర్పాట్లు చేస్తోంది. దండుమల్కాపురానికి ఇన్‌ఛార్జిగా ఉన్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి 15 ప్రత్యేక బస్సుల్లో గ్రామస్థులను యాదాద్రి యాత్రకు తీసుకువెళ్లారు. అనంతరం వారి కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నాంపల్లిలో ఇంటింటికి వెళ్లి తెరాస సర్కార్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ, ప్రచారం నిర్వహించారు. మర్రిగూడ మండలం దామెరభిమానపల్లిలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఓట్లు అభ్యర్థించారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ వార్డుల్లో పర్యటిస్తూ తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. చౌటుప్పల్‌ మండలం దేవలమ్మనాగారంలో రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రచారం చేశారు.

మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ సమావేశం.. మునుగోడు మండలం చీకటిమామిడిలో గౌడ సంఘం నేతలతో ఉపసభాపతి పద్మారావు సమావేశమయ్యారు. కొంపల్లిలో గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఆబ్కారీ, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ హాజరయ్యారు. కేసీఆర్‌ హయాంలోనే వృత్తిదారుల తలరాతలు మారాయన్నారు.

భాజపా పాలిత ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం కన్నా ఏ ఒక్క సౌకర్యం అయినా ఎక్కువగా ఉందా. కాంగ్రెస్​, భాజపా దేశాన్ని పరిపాలించాయి. ఏమైనా మార్పు వచ్చిందా.. దేశంలో జరగలేని అభివృద్ధి నేడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గంవారు నష్టపోకూడదనే తపన కేసీఆర్​ది. రాష్ట్రాన్ని ప్రయోగశాల మార్చారు. కేంద్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం లేకపోయిన, ఒకవైపు వేధిస్తున్న రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు. మునుగోడు ప్రజలు భాజపా, కాంగ్రెస్​ పార్టీలు ఏమి చెప్పిన నమ్మవు. -శ్రీనివాస్‌గౌడ్, ఆబ్కారీ మంత్రి

చండూరులో రాజగోపాల్​రెడ్డి.. చండూరు పరిధిలోని అంగడిపేటలో భాజపా ఆధ్వర్యంలో జరిగిన చేనేత ఆత్మీయ సమ్మేళనానికి పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీ వివేక్‌ హాజరయ్యారు. చండూరులో భాజపా సమావేశం వద్ద అడ్డదిడ్డమైన పార్కింగ్‌తో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అటుగా వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాసేపు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి మద్దతుగా దేవలమ్మనాగారంలో సినీనటి జీవితారాజశేఖర్ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మునుగోడు నుంచి చండూర్‌కు వెళ్లే మార్గంలో తాస్కానిగూడెం వద్ద భాజపా అభ్యర్థి ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన మహిళలతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్‌ ముచ్చటించారు.

కాంగ్రెస్​ దూకుడు.. ఓ వైపు భారత్‌ జోడో యాత్ర... మరో వైపు ఉపఎన్నికలతో మునుగోడు ప్రచార బాధ్యతలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భుజాలకెత్తుకున్నారు. ఎన్​ఎస్​యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్‌తుండగా పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలిసి రేవంత్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. నాంపల్లి మండలం మెల్లవాయిలో పార్టీ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క వాడవాడకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే పంటపొలాల్లో కూలీల వద్దకు వెళ్లిన ఆమె పత్తి చేనులో పత్తిని తీసి ఓట్లు అభ్యర్థించారు. మునుగోడు మండలం సోలీపురం, చొల్లేడు గ్రామాల్లో పాల్వాయి స్రవంతికి మహిళలు మంగళ హారతులతో స్రవంతికి ఘనస్వాగతం పలికారు.

పోలీసులు తనిఖీలు ముమ్మరం.. మరోవైపు ఎన్నిక వేళ డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ఈసీ విస్తృత చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర బలగాలు మోహరించాయి. అలాగే నియోజకవర్గానికి వెళ్లే అన్ని మార్గాల్లోనూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలిమెల చెక్‌పోస్ట్ వద్ద పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌ను పోలీసులు ఆపారు. మంత్రి ప్రయాణిస్తున్న కారులోని బ్యాగులతో పాటు కాన్వాయ్‌లోని ఇతర వాహనాలు పూర్తిగా పరిశీలించారు.

ఉపఎన్నిక జాతర వచ్చే.. ఓటర్లకు పండుగ తెచ్చే..!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details