Munugode By Poll campaign ends Today : మునుగోడు ఉపఎన్నిక పోరు చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ్టితో ప్రచారఘట్టానికి తెరపడనుండటంతో ప్రధాన పార్టీలు ఆఖరి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఓటర్లను తమవైపు తిప్పుకోవటమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఉప పోరును తెరాస, భాజపాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా.. కాంగ్రెస్ పార్టీ కూడా హోరాహోరీగా తలపడుతోంది.
Munugode By election campaign ends Today : తెరాస తరుఫున ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు మునుగోడులో, ఆదివారం రోజు చండూరులో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మంత్రులు మండలాలవారీగా, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామలవారీగా బాధ్యతలు తీసుకొని ప్రతిఓటరను కలిశారు. వామపక్షాల బలాన్ని ఒడిసిపట్టేందుకు కూడా గులాబీపార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.
40మంది స్టార్ క్యాంపెయినర్లతో భాజపా జోరుగా ప్రచారం నిర్వహించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ సహా ఇతర నేతలు ఇంటింటికి తిరిగారు. పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గంలోనే మకాం వేసి విస్తృత ప్రచారం చేశారు. కొన్నిరోజులుగా ప్రచారంలో వేగం పెంచిన కాంగ్రెస్.. సంప్రదాయ ఓటు బ్యాంకును నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఒక్కసారి ఛాన్స్ అంటూ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటికి తిరుగుతున్నారు. ఆమె తరుఫున పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా ఇతర నేతలు ప్రచారం చేశారు.
మహిళా గర్జన సభ:ఆఖరిరోజు ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు తీవ్రంగా శ్రమించనున్నాయి. మధ్యాహ్నం సంస్థాన్‌నారాయణపూర్‌లో జరిగే రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. మర్రిగూడలో మంత్రి హరీశ్‌రావు, చండూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావులు ప్రచారం నిర్వహించనున్నారు. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు ముఖ్యనేతలు నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు.
కాంగ్రెస్ చివరిరోజున మహిళా గర్జన సభ ద్వారా నియోజకవర్గ ప్రజల మద్దతు కోరనుంది.ఉపఎన్నిక ప్రచారం సాయంత్రం ఆరుగంటలకు ముగియనుంది. అనంతరం సామాజిక మాధ్యమాలపై దృష్టిపెట్టాలని పార్టీలు నిర్ణయించాయి. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుని ఓటర్లకు సమాచారం పంపించే ఏర్పాట్లు చేశాయి.