పాస్‌బుక్ ఇవ్యడానికి రూ.5 వేలు కావాలా సారు..? MRO Asked For Bribe In Yadadri Revenue Office :రెవెన్యూ వ్యవస్థను ఎంత ప్రక్షాళన చేసినా అందులో వేళ్లూనుకుపోయిన అవినీతిని రూపుమాపటం మాత్రం ఎవరితో సాధ్యపడేలా లేదు. ఎన్ని వ్యవస్థలను రద్దు చేసినా ఎంతో టెక్నాలజీని ఉపయోగించినా మమ్మల్ని మాత్రం ఎవరూ మార్చలేరన్నట్లుగా కొందరు అధికారులు ప్రవర్తిస్తున్నారు. అవకాశం దొరికితే చాలూ కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నత ఉద్యోగుల వరకు ఎవరూ వదిలిపెట్టడంలేదు. తాజాగా ఓ ఎమ్మార్వో నే తనకు ఖర్చులుంటాయంటూ రైతును డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటన విస్మయం కలిగిస్తోంది.
యాదగిరిగుట్టలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం రెవెన్యూశాఖలో నేటికీ కొనసాగుతున్న అమ్యామ్యాల సంస్కృతికి అద్దం పడుతోంది.ధరణి డిజిటలైజేషన్‌తో అక్రమార్కుల ఆగడాలు, అవినీతి అధికారులకు చెక్ పెట్టామని ప్రభుత్వం చెబుతున్న మాట. కానీ, సర్కార్ ఎన్ని చేసినా కుక్క తోక వంకరే అనే సామెతను మాత్రం కొందరు అధికారులు నిజం చేస్తూనే ఉన్నారు. యాదగిరిగుట్టలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటననే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
Yadadri MRO took Bribe To Issue Passbook :యాదాద్రి ఆలయ పునఃనిర్మాణంతో యాదగిరిగుట్ట ప్రాంతంలో భూములకు రెక్కొలొచ్చాయి. దీంతో జోరుగా భూ బదలాయింపులు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన ఓ రైతు తనకున్న వ్యవసాయ భూమిలో ఎకరా భూమిని రెండ్రోజుల క్రితం మరొకరికి విక్రయించాడు. యాదగిరి గుట్ట తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెండ్రోజుల క్రితమే పూర్తి చేశాడు. తర్వాత పాసుపుస్తకం కోసం అధికారుల వద్దకు వెళ్లగా సాంకేతిక కారణాలు చెప్పి మరుసటి రోజు రమ్మన్నారు. తర్వాత రోజు రైతు కార్యాలయానికి వెళ్లగా తహసీల్దార్ ఉన్నతాధికారుల సమావేశంలో ఉన్నారని కిందిస్థాయి ఉద్యోగులు చెప్పి పంపించారు. చేసేదేం లేక వెనుదిరిగిన రైతు గురువారం మరోసారి కార్యాలయానికి వెళ్లాడు. రెండుమూడ్రోజులుగా తిప్పుకుంటుండటంతో అనుమానం వచ్చిన ఆ రైతు ఈ సారి తన ఫోన్‌లో వీడియో రికార్డర్ ఆన్‌చేసి వెంట తీసుకెళ్లాడు.
పాస్‌బుక్ కావాలంటే రూ.5 వేలు ఇవ్వు : కార్యాలయంలో తహసీల్దార్ శోభన్‌బాబు అందుబాటులో ఉండగా ఆయన వద్దకు వెళ్లి, పాసుపుస్తకం ఇవ్వాల్సిందిగా రైతు కోరాడు. "బాధ్యత కలిగినన కుర్చీలో ఉన్నానన్న సోయి లేదు కార్యాలయంలో ఉన్నానన్న ధ్యాసే లేదు పక్కనే ఉద్యోగులున్నారన్న ఆలోచన లేదు” పాసుపుస్తకం కోసం వచ్చిన రైతును రూ.5వేలు ఇచ్చి, తీసుకెళ్లమని తహసీల్దార్ చెప్పాడు. అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు డబ్బులెందుకివ్వాలని రైతు అడగ్గా తనకు ఖర్చులు, ఇతర ప్రొటోకాల్ ఉంటుందని వాటికోసమే డబ్బులు కావాలని అడిగాడు. ఈ తతంగాన్నంతా రైతు తాను వెంట తీసుకెళ్లిన ఫోన్‌లో రికార్డు చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియో చూసి ఎమ్మార్వోపై ఫైర్ అవుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. కొందరు సర్కార్ అధికారుల తీరు మాత్రం మారడం లేదని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎమ్మార్వో లంచం అడిగిన ఘటనపై ఇంకా పోలీసులకు ఫిర్యాదు వెళ్లనట్లు సమాచారం.
ఇవీ చదవండి: