MP Venkat Reddy Protest Polluting Industries: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ పరిసరాలలో చందోక్ ల్యాబరేటరీస్, ఆస్ట్ర ఇండస్ట్రీస్, అజంతా కెమికల్స్ పరిశ్రమలను తొలగించాలని కొండమడుగు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. చందోక్ పరిశ్రమలోని పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ కంపెనీలోని ఓల్డ్ మిషనరీని వెంటనే తొలగించాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయా కంపెనీల ప్రతినిధులతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్లో మాట్లాడారు. కాలుష్యానికి కారణమైన పాత యంత్రాలను తొలగించాలని వారికి చెప్పారు. ఇక్కడి పరిశ్రమల వల్ల కాలుష్యం పెరిగిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వాయు, నీటి కాలుష్యం పెరిగి పరిసర ప్రాంత ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో చందోక్ ల్యాబరేటరీస్ వారు రేపటి నుంచే పాత యంత్రాలు తొలగిస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
కొండమడుగు గ్రామాన్ని పరిశ్రమల జోన్ నుంచి తొలగించి రెసిడెన్షియల్ జోన్‌గా ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న రసాయన పరిశ్రమలను తొలగించే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో హైదరాబాద్- వరంగల్ మార్గంలోని బీబీనగర్ ఎయిమ్స్, కొండమడుగు ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.