Building Collapsed in Yadagirigutta: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రెండంతస్తుల భవనం ముందు భాగం(బాల్కనీ) కూలిన ఘటనలో మృతులందరిదీ హృదయ విదారకర పరిస్థితులే ఉన్నాయి. బాల్కనీ కిందే ముగ్గురు స్నేహితులు మాట్లాడుతుండగా ఒక్కసారిగా అది కుప్పకూలడంతో అక్కడికక్కడే వారందరూ మృతిచెందగా... వేరే ఒకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. వీరిలో ముగ్గురు యువకులే. నలుగురు మృతుల్లో ముగ్గురు వారి కుటుంబాలకు పెద్ద దిక్కు. అందులో ఇద్దరికీ పదేళ్ల లోపు ఇద్దరిద్దరు ఆడపిల్లలు ఉండగా.. మరొకరికి ఏడాదిన్నర వయసున్న పాప, నిండు గర్భిణి అయిన భార్య ఉన్నారు.
ఒక్కసారిగా నలుగురి మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుండ్లపల్లి దశరథ (70), శ్రీనాథ్ (38), ఉపేందర్(38), శ్రీనివాస్(40) మృతితో కుటుంబీకులతో పాటు సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. పట్టణ పరిసరాల్లో బాధితుల రోదనలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. భువనగిరి ఏరియా ఆసుపత్రిలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు ముగిశాయి. మరోవైపు యాదగిరిగుట్టలో ఘటనా స్థలాన్ని రాచకొండ క్రైమ్ డీసీపీ యాదగిరి పరిశీలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
యాదగిరిగుట్టలో నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరం. మా ముగ్గురు మిత్రులు ఈ ఘటనలో చనిపోయారు. మరో మిత్రుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ ముగ్గురు పనిచేస్తేనే వారి కుటుంబాలు బతికే దుర్భర పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఆ కుటుంబాలకు ప్రభుత్వం రూ.25లక్షల చొప్పున ప్రకటించాలని కోరుకుంటున్నాం. దిక్కులేని ఆ కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాం. -మృతుల మిత్రుడు
వాళ్లను చూసుకునేవాళ్లు ఎవరూ లేరు ఇంట్లో పెద్దదిక్కు ఆయనే. ఇప్పుడు ఆయనే చనిపోయాడు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. వారికి పరిహారం చెల్లించాలి. -స్థానికురాలు