ఆలేరు నియోజకవర్గానికి సాగునీటిని అందించేందుకు ఆరు అవకాశాలను వినియోగించుకుని 8 మండలాలలకు సాగునీటిని అందించే లక్ష్యంగా ముందుకు పోతున్నామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని నియోజకవర్గ సాగునీటి లభ్యతపై అధికారులతో చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 15, 16 ప్యాకేజీలో భాగంగా నిర్మితమవుతున్న కాలువల ద్వారా బొమ్మలరామారం, తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు మండలాలకు సాగునీరు అందించే వీలుందని ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి అన్నారు. అశ్వరావుపల్లి కాలువల ద్వారా ఆలేరు మండలంలోని 6 గ్రామాలకు, నవాబ్ రిజర్వాయర్ ద్వారా గుండాల మండలానికి సాగునీరు అందుతుందన్నారు.
ఆలేరు నియోజకవర్గానికి ఉన్న సాగునీటి సౌకర్యాలన్నింటినీ వాడుకుని నియోజకవర్గంలోని చెరువులను నింపేందుకు ప్రణాళికలను తయారు చేస్తున్నామన్నామని ఆమె స్పష్టం చేశారు. చెరువుల స్థితిగతులు, చెరువులకు వెళ్లేందుకు ఉండాల్సిన ఫీడర్ చానళ్లను గుర్తించేందుకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో సర్వే జరుపుతున్నామన్నారు. చెరువుల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భూములను గుర్తించి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. నీటిని నింపేందుకు చెరువులకు కావాల్సిన సౌలభ్యం గుర్చి తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు, అనుభవజ్ఞులతో చర్చ జరుపుతున్నట్లు ఆమె తెలిపారు.