రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా తీసుకొచ్చిన కొత్త పురపాలక చట్టంలో పచ్చదనానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు ఆయన వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పట్టణంలోని అతిథి గృహం ఆవరణలో రూ.8.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ భవన నిర్మాణం, నిరాశ్రయుల వసతిగృహం, భువనగిరి బైపాస్ వద్ద రూ.1.61 కోట్ల వ్యయంతో స్మృతి వనం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద ఉన్న ఐబీ(నీటి పారుదల శాఖ కార్యాలయం )ఆవరణలో రూ.11.50 లక్షలతో వీధి విక్రయదారుల కోసం నిర్మించిన 25 షాపులు, పట్టణ శివారులోని రిసోర్స్ పార్క్ లో మానవ వ్యర్ధాల శుద్దికరణ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ప్రారంభిస్తున్నప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ని రద్దు చేయాలని నిరసిస్తూ.. భాజపా, సీపీఎం పార్టీ నాయకులు ఫ్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.
పట్టణ ప్రగతి టాయిలెట్ మానిటరింగ్ యాప్, మున్సిపాలిటీల అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడానికి త్రైమాసిక వార్తా పత్రికను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా పట్టణాల్లో శాశ్వతంగా డంప్ లేకుండా చేస్తామన్నారు. పట్టణ ప్రగతి పురస్కారాలు 5 కేటగిరీల్లో అందిస్తామని వెల్లడించారు. భువనగిరి మున్సిపాలిటీకి 5 కోట్ల నిధులు ప్రతీ నెలా అందుతున్నాయని, పారిశుద్ధ్య కార్మికులకు ప్రతీ నెలా వేతనాలు అందుతున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి జడ్పి ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి, తదితరులు హాజరయ్యారు.
"భువనగిరిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం. అన్ని పురపాలక సంఘాలు అభివృద్ధి కావాలనేది సీఎం ఆకాంక్ష. గాంధీ జయంతిని స్వచ్ఛతా దినోత్సవంగా పాటించాలి. రాష్ట్రంలో 43 శాతం ప్రజలు పట్టణాల్లో ఉంటున్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస వస్తున్నారు. అన్ని పట్టణాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రతి వెయ్యిమందికి ఒక శౌచాలయం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొత్త పురపాలక చట్టంలో పచ్చదనం పెంచేందుకు ప్రాధాన్యం. 142 పురపాలకసంఘాల్లో 1,326 నర్సరీలు ఏర్పాటు చేస్తున్నాం.