యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వాపురం రిజర్వాయర్ పనుల పురోగతిపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి బుధవారం.. సమీక్ష నిర్వహించారు. జలాశయం నిర్మాణ పనుల్లో భాగంగా ప్యాకేజీ 14, ప్యాకేజీ 15లో భాగంగా 40 కిలోమీటర్ల మేర జరుగుతున్న పనుల వివరాలను మంత్రి తెలుసుకున్నారు. ప్యాకేజీ 14, ప్యాకేజీ 15 జంక్షన్ నుంచి కొడకండ్ల, తీగుళ్ల, జగదేవ్ పూర్, వీరారెడ్డి పల్లి, తుర్కపల్లి, ముల్కలపల్లి, జంగంపల్లి మీదుగా కాలువగట్ల నిర్మాణాలతో పాటు లైనింగ్ నిర్మాణాలను పరిశీలిస్తూ నిన్న సాయంత్రానికి బస్వాపూర్ చేరుకున్నారు.
మల్లన్నసాగర్ నుంచి ప్యాకేజీ 15, ప్యాకేజీ 16 పరిధిలోని 36 కిలోమీటర్ల మేర రూపొందించిన గందమళ్లకు 2,450 క్యూసెక్కుల నీరు చేరుకుంటుందని మంత్రి అన్నారు. అంతేకాకుండా జగదేవ్ పూర్ వద్ద డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ నుంచి 6,467 ఎకరాల ఆయకట్టుకు ఎల్యంసీ నుంచి 37 వేల 814 ఎకరాలు, ఆర్యంసీ నుంచి 19 వేల 19 ఎకరాల ఆయకట్టుకు నీరు పారేలా ప్రాజెక్ట్ రూపొందించినట్లు అధికారులు వివరించారు.