సమస్య ఏదైనా... ఇంటి వద్దకే వైద్యసేవలు...! యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని పాలియేటీవ్ కేంద్రంలో ఇంటి వద్దకే వైద్యసేవల కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ఏడాది క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కేంద్రాలకు రాలేని వారికోసం రోగుల వద్దకే వైద్యసిబ్బంది వెళ్లి సేవలు అందిస్తున్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికి తిరిగి ముప్పైయేళ్లు పైబడిన వారి ఆరోగ్యవివరాలు సేకరిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా రోగుల ఇంటికి వెళ్లి వైద్యులు చికిత్స చేస్తున్నారు. అన్ని సదుపాయాలు ఉన్న ప్రత్యేక వాహనంతో పాటు, 104 సంచార వాహనాలు, ఆరోగ్య ఉపకేంద్రాలను ఈ కార్యక్రమానికి వినియోగిస్తున్నారు.
ఇప్పటికే లక్షాముప్పైతొమ్మిది వేల మందికి సేవలు...
యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ పాలియేటివ్ కేంద్రం ద్వారా ఇప్పటివరకు లక్షా ముప్పై తొమ్మిదివేల మంది వయోవృద్ధులకు చికిత్స అందించారు. ఇందులో 737 మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో 188 మంది క్యాన్సర్, 552 మంది పక్షవాతం, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. వీరందరికి ఇంటింటికి వెళ్లి చికిత్స చేసి, మందులు ఇస్తున్నారు. అవసరమైన వారిని పాలియేటివ్ కేంద్రంలో చేర్చి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. రోజుకు 15 నుంచి 20 మంది ఇంటి వద్దే వైద్యసేవలు పొందుతున్నారు. 144 మందిని పాలియేటివ్ కేంద్రంలో ఇన్పేషంట్గా చేర్చుకొని వైద్యసేవలు అందిస్తున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా... తమకు తెలియజేస్తే చాలు... ఇంటికే వచ్చి వైద్యం చేస్తామంటున్నారు చౌటుప్పల్ పాలియేటివ్ కేంద్రం బాధ్యులు డాక్టర్ కాటంరాజు.
నెలనెలా ఇంటికెళ్లి పర్యవేక్షణ...
క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు ఆస్పత్రిలో చేర్చుకుని అవరసమైన అన్ని వైద్యసేవలు అందిస్తున్నారు. చికిత్స అనంతరం ఆస్పత్రి వాహనంలోనే ఇంటికి చేర్చుతున్నారు. ప్రతీనెల రోగి వద్దకే వెళ్లి... ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అవసరమైన వైద్యం, మందులు అందిస్తున్నారు. తాము ఉన్న చోటకే వచ్చి ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందటం పట్ల రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని జిల్లాల్లో అమలుకు కసరత్తు....
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతం కావటం వల్ల మరికొన్ని జిల్లాల్లో విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లో అమలు చేయటం కోసం కొంత మంది సిబ్బందికి... చౌటుప్పల్ పాలియేటివ్ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు.
వయోవృద్ధుల ఆరోగ్య వివరాలను వారి వ్యక్తిగత కార్డుల్లో పొందుపరుస్తున్నారు. ఈ వివరాలన్ని కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తారు. ముప్పైఏళ్లు పైబడిన వారందరి ఆరోగ్యనివేదిక తయారు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం జమ్ముకశ్మీర్ వైద్యుల బృందం ఈ పాలియేటివ్ కేంద్రాన్ని సందర్శించి... రోగులకు అందిస్తున్న సేవలపై ప్రసంశలు కురిపించారు.
ఇవీ చూడండి: బాలాపూర్ లడ్డూ రికార్డు బద్దలు కొట్టిన ఫిలింనగర్ లడ్డూ...!