తెలంగాణ

telangana

ETV Bharat / state

దండుమల్కాపురం పారిశ్రామిక పార్కులో తయారీ షురూ

Dandumalkapuram Industrial Park Manufacturing : దేశంలోనే తొలిసారిగా యాదాద్రి జిల్లా దండుమల్కాపురం పారిశ్రామిక పార్కులో తయారీ షురూ అయింది. ప్యాకేజింగ్‌, భవన నిర్మాణ సామగ్రి, ఆహార శుద్ధి, ఇటుకల తయారీ, ఎలక్ట్రిక్‌ ఆటో యూనిట్‌ సహా 15 పరిశ్రమల్లో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. ఇతర ప్రాంతాలకు ఎగుమతులు కూడా మొదలయ్యాయి.

Dandumalkapuram Industrial Park Manufacturing , industrial park
దండుమల్కాపురం పారిశ్రామిక పార్కులో తయారీ షురూ

By

Published : Feb 22, 2022, 9:29 AM IST

Dandumalkapuram Industrial Park Manufacturing : దేశంలోనే తొలిసారిగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్‌), తెలంగాణ రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో సంయుక్తంగా, కాలుష్య రహితంగా నెలకొల్పిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక పార్కులోని పలు పరిశ్రమల్లో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. రెండేళ్ల క్రితం దీని నిర్మాణానికి 687.10 ఎకరాల భూసేకరణ అవసరమని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఇది రెండు వేల ఎకరాలకు చేరుకుంది. భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో 450 పరిశ్రమలకు భూకేటాయింపులు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్యాకేజింగ్‌, భవన నిర్మాణ సామగ్రి, ఆహార శుద్ధి, ఇటుకల తయారీ, ఎలక్ట్రిక్‌ ఆటో యూనిట్‌ సహా 15 పరిశ్రమల్లో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. ఇతర ప్రాంతాలకు ఎగుమతులు ఆరంభమయ్యాయి. మరో వంద పరిశ్రమలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. మరిన్ని పరిశ్రమల స్థాపనకు అనుమతులు లభించినప్పటికీ, రుణాలు మంజూరులో జరుగుతున్న జాప్యం కారణంగా నిర్మాణ పనులను మొదలుపెట్టలేదని పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు.

తొలి ఉత్పత్తులు ఎలక్ట్రిక్‌ వాహనాలే

ఇక్కడ ఉత్పత్తి మొదలుపెట్టిన తొలి పరిశ్రమ ఎలక్ట్రిక్‌ ఆటోల తయారీ యూనిట్‌. నాలుగు నెలల క్రితం ఆరంభమైన ఉత్పత్తి ఇటీవల ఊపందుకుంది. ప్రస్తుతం ఇక్కడ రవాణా, ప్రయాణికుల ఆటోలను తయారుచేయడంతోపాటు, డీజిల్‌, పెట్రోల్‌తో నడిచే ఆటోలను ఎలక్ట్రిక్‌గానూ మారుస్తున్నారు. ఇప్పటికే 40కి పైగా రవాణా ఆటోలను ఏపీ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో 400 ఆటోలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ కంపెనీ సీఈవో రాణి శ్రీనివాస్‌ తెలిపారు. మసాలాల తయారీ, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు కూడా ఇక్కడ తయారై ఎగుమతుల స్థాయికి చేరుకున్నాయి.

తుది దశకు వసతుల కల్పన

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి పక్కనే నిర్మించిన ఈ పార్కులో వసతుల కల్పన తుది దశకు చేరుకుంది. ఆవరణలో నాలుగు, రెండు వరుస రహదారులను నిర్మించారు. వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల కోసం రూ.40 కోట్లతో నివాస సముదాయాలు, సమావేశాల నిర్వహణ నిమిత్తం నిర్మిస్తున్న కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ భవనం పనులు తుది దశలో ఉన్నాయి. ‘‘వచ్చే ఏడాది డిసెంబరు నాటికి 450 పరిశ్రమల్లో ఉత్పత్తులు మొదలు పెట్టాలనే ప్రణాళికతో పనులు జరుగుతున్నాయి. అన్నింటిలో ఉత్పత్తులు ప్రారంభమైతే స్థానికులకు ఉపాధి లభిస్తుంది. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి కూడా కల్పిస్తామని’’ టిఫ్‌ అధ్యక్షుడు కె. సుధీర్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:గురుకులాల్లో భారీగా పోస్టులు.. 10 వేల వరకు భర్తీ అయ్యే అవకాశం..

ABOUT THE AUTHOR

...view details