వాగులో పడ్డ యువకుడు.. కాల్వలో కొట్టుకుపోయిన ఎద్దు గులాబ్ తుపాను ప్రభావం(cyclone gulab effect) తెలంగాణపై తీవ్రంగా పడింది. రెండ్రోజులుగా ఏకధాటిగా కురిసిన వర్షాల(Telangana rains 2021)తో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో వాగులు, చెరువులు పొంగి రహదారులపైకి వరద చేరింది.
యాదాద్రి జిల్లా ఆలేరు సమీపంలో ఓ వ్యక్తికి గండం తప్పింది. ఓ యువకుడు ద్విచక్రవాహనంతో సహా వరద నీటిలో పడిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు రక్షించారు.
రమేశ్ అనే యువకుడు ఆలేరు నుంచి కొలనుపాక వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. పెద్దవాగు లోలెవెల్ కాజ్‌వే వద్ద వాగులో పడిపోయాడు. నీటి ప్రవాహం స్వల్పంగానే ఉన్నా రోడ్డుపై నాచు ఉండటం వల్ల... బండి జారి వాగులో పడిపోయాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు, కానిస్టేబుల్ నవీన్ యువకున్ని కాపాడారు. వాహనాన్ని తాడు సాయంతో పైకి లాగారు...
కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని కాకతీయ కాలువలో కొట్టుకుపోతున్న మూగజీవాన్ని... సైనిక పాఠశాల శిక్షకులు సాహసంతో రక్షించారు. రుక్మాపూర్ సైనిక పాఠశాలకు సమీపంలోని కాకతీయ కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గ్రామంలోని ఓ ఎద్దు మేతకు వెళ్లి అనూహ్యంగా నీటిలో పడిపోయింది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న సైనిక పాఠశాల శిక్షకులు కాలువలో దూకి మూగజీవాన్ని రక్షించారు.