Non local voters in munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికలకు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఓటర్లు కీలకంగా మారనున్నారు. సుమారు 25 వేల మందికిపైగా ఓటర్లు హైదరాబాద్‌లో ఉండడంతో వారిపై తెరాస, భాజపా, కాంగ్రెస్ దృష్టి సారించాయి. మునుగోడు నియోజకవర్గం హైదరాబాద్‌కు చేరువలోనే ఉన్నా పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. ఉపాధి కోసం మునుగోడు నుంచి వేలాది మంది హైదరాబాద్ వచ్చారు. సరైన విద్యాసంస్థలు సైతం లేకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం హైదరాబాద్ వచ్చి నివాసం ఏర్పర్చుకున్నారు. వారిని గుర్తించి ఆకట్టుకునేలా.. పక్కా ప్రణాళికతో ప్రధాన పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఈ బాధ్యతను హైదరాబాద్‌లోని ముఖ్య నేతలకు అప్పగించాయి. ఉద్యోగరీత్యా కానీ, వ్యాపారరీత్యా గానీ బతుకుతెరువు గురించి హైదరాబాద్ దాదాపు 500 మంది వలస వెళ్లారని తెరాస ఎమ్మెల్సీ తాత మధు తెలిపారు. అందరిని ఓటింగ్‌కు రమ్మని చెప్పడం జరిగిందని అన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2 లక్షల 27 వేల 265. కొత్తగా ఏర్పాటైన గట్టుప్పల్ మండలంలోని తేరట్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 2 వేల 211 ఓట్లు ఉండగా... ఇందులో 520 మంది ఓటర్లు హైదరాబాద్‌లోనే ఉన్నారు. మునుగోడు మండలంలోని కల్వకుంట్ల, కొంపల్లి గ్రామాల్లో సుమారు 3 వేల ఓటర్లు ఉండగా అందులో 500 పైచిలుకు ఓటర్లు భాగ్యనగరంలోనే ఉన్నారు. ఇలా నియోజకవర్గంలోని ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లలో 200 నుంచి 600 మంది ఓటర్లు హైదరాబాద్‌లో ఉన్నట్లు పార్టీలు గుర్తించాయి. హైదరాబాద్‌లో నివాసం ఉండే మునుగోడు నియోజకవర్గ ఓటర్లు... ఉప ఎన్నికను ప్రభావితం చేయనున్నారు. దీంతో మూడు ప్రధాన పార్టీలు ఈ ఓటర్లను ఆకట్టుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.