యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి(yadadri temple) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారికి లక్ష పుష్పార్చన పూజలు(laksha pushparchana pujalu at yadadri) శాస్త్రోక్తంగా జరిగాయి. బాలాలయ మండపంలోని స్వామి వారి ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో దివ్యమనోహరంగా అలంకరించి...ప్రత్యేక వేదికపై వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం సుమారు గంటకుపైగా పూజలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన పూజలు(laksha pushparchana pujalu) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ వేడుకలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
చకాచకా పనులు..
యాదాద్రి పుణ్య క్షేత్రాభివృద్ధిలో(Yadadri temple latest news) భాగంగా కొండపైకి వచ్చి, పోయే మార్గాల విస్తరణతో సహాపై వంతెనల నిర్మాణం జోరందుకుంది. కొండెక్కి, దిగే కనుమదారులకు రెండు దిక్కులా పైవంతెనలు నిర్మిస్తున్నారు. కొండకు ఉత్తరదిశలో 12మీటర్లు వెడల్పు, 650 మీటర్ల పొడవున కట్టే వంతెనకు రెండో ఘాట్ రోడ్డుకు కలపనున్న వంతెన పిల్లర్‌కు వేయాల్సిన 22 స్లాబుల్లో... 14 పూర్తైనట్లు యాడా(Yadagirigutta Temple Development Authority) అధికారులు తెలిపారు. రూ.143 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వలయదారి ప్రణాళికల్లో భాగంగా ఈ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పాత కనుమదారి విస్తరణతోపాటు కొండెక్కేందుకు చేపట్టిన పైవంతెన కోసం పిల్లర్ల పనులు వేగవంతం చేశారు.