KTR angry on Election Commission: మునుగోడు రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది. బ్యాలెట్ పేపర్ వ్యవహారం కాస్త మునుగోడు రిటర్నింగ్ అధికారి బదిలీకి దారితీసింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మునుగోడు రిటర్నింగ్ అధికారి బదిలీ వ్యవహారంలో ఈసీ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని కేటీఆర్ అన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలను భారతీయ జనతా పార్టీ దుర్వినియోగం చేస్తోందని చెప్పడానికి ఇది మరో తార్కాణమని కేటీఆర్ అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్‌పై భాజపా ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గతంలో తమ అభ్యర్ధన మేరకు 2011లోనే రోడ్డు రోలర్ గుర్తును తొలగించి.. మళ్లీ ఇప్పుడు తీసుకురావడం ప్రజాస్వామ్యం, ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. కారును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందేందుకు భాజపా కుటిల ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.