KTR tweet on Rayagiri step well: తెలంగాణ అంటేనే ఎన్నో కళలు, సంప్రదాయాలు, ప్రాచీన కట్టడాల సముదాయం. వాటిని కాపాడుకుంటూ వారసత్వంగా సిద్ధించిన ప్రాచీన కట్టడాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే నడుంబిగించింది. అందులో భాగంగానే రాష్ట్రంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాచీన కట్టడాలను గుర్తించి వాటికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శ్రీకారం చుడుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాయగిరి వాసులకు మరింత సంతోషాన్ని కల్గిస్తోంది.
"తెలంగాణలోని వారసత్వ ప్రదేశాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం చేపట్టిన మరో అడుగు.. ఈసారి యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలోని వెంకటేశ్వర ఆలయంలో ఉన్న 600 ఏళ్ల నాటి మెట్ల బావిని పునరుద్ధరించే సమయం ఆసన్నమైంది". అని ట్విటర్లో రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించి మెట్లబావి ఫోటోలను ట్యాగ్ చేశారు. కేటీఆర్ ట్వీట్ పట్ల రాయగిరి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గత కొద్ది రోజులు కిందట జిల్లా కలెక్టర్ పమేలా సత్పతీ రాయగిరిలోని మెట్ల బావిని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. యాదాద్రికి వచ్చిన భక్తులు మెట్ల బావిని సందర్శించేలా పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Bansilalpet StepWell: ఇప్పటికే హైదరాబాద్ చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే కట్టడాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, హెచ్‌డీఏ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నాటి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రణాళికబద్ధంగా కార్యాచరణ చేపట్టిన సర్కార్.. జంటనగరాల్లో పురాతన మెట్ల బావుల మరమ్మతులకు నడుంబగించింది. నిజాం కాలంలో ప్రధాన రహదారులకు 100మీటర్ల దూరంలో నిర్మించిన ఈ బావులు.. ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వందకు పైగానే ఉన్నా.. అందులో చాలా వరకు కనుమరుగయ్యాయి.
కొన్ని బావుల స్థలాల్లో నిర్మాణాలు వెలియగా.. మరికొన్ని చోట్ల ఉన్న బావులు రూపును కోల్పోయి, చెత్తచెదారానికి ఆవాసాలుగా మారాయి. ఇలా దయనీయ పరిస్థితుల్లో కనిపిస్తున్న మెట్లబావుల్లో ఒకటి.. బన్సీలాల్‌పేట్‌లో 3శతాబ్దాల క్రితం నిర్మించిన నాగన్నకుంట నీటివనరు. 30.5 మీటర్ల పొడవు, 19.2 అడుగుల వెడల్పు, 53 అడుగుల లోతుతో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో అబ్బురపరిచే నిర్మాణశైలితో ఈ కట్టడం నిర్మితమైంది. దశాబ్దాలుగా నిరాదరణకు గురై, రూపురేఖలు కోల్పోయిన ఈ మెట్లబావిని పునరుద్ధరించి కొత్త అందాలు తెచ్చిపెట్టారు. ఈ మెట్ల బావిని కొద్ది నెలల కిందట మంత్రి కేటీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే..
ఓరుగల్లు మెట్ల బావులకు.. మహర్దశ ఎప్పుడో..?:చారిత్రక నగరంగా ఖ్యాతిగాంచిన ఓరుగల్లులో మెట్లబావుల నిర్వహణ.. అంతంతమాత్రంగానే ఉంటోంది. వరంగల్‌కు వచ్చే పర్యాటకులకు ఇవి ఎక్కడ ఉన్నాయో చెప్పే వారే కరవయ్యారు. వీటిని సత్వరమే బాగు చేసి.. సుందరంగా తయారు చేస్తే.. పర్యాటకులకు కనువిందు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవీ చదవండి: