KTR Fires On Central Government: ఎమ్మెల్యే అమ్ముడు పోతే మునుగోడులో ఉపఎన్నిక వచ్చిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయారని విమర్శించారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. మోదీ, రాజగోపాల్‌రెడ్డి అహంతో ఉపఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి చేసిందేమీ లేదని ఆక్షేపించారు. భాజపా అధికారంలోకి వచ్చాక సిలిండర్ ధర 3 రెట్లు పెరిగిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
కేంద్రంలో భాజపా ప్రభుత్వం వచ్చాక ఒక్క మంచి పనిచేసిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదలకు మంచి జరిగిందా అని నిలదీశారు. పెట్రో ల్, డీజిల్ ధరలు పెంచడంతో సరకులు ధరలు ఆకాశాన్ని తాకాయని ఆక్షేపించారు. సామాన్యుడి నడ్డి విరిచి కార్పొరేట్ అధిపతులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచామని తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని కేటీఆర్ గుర్తు చేశారు.
"మద్యానికో, డబ్బులకు ఆశపడి దుర్మార్గులకు ఓటేస్తే సిలిండర్ ధర నాలుగు వేల రూపాయలు అవుతుంది. అప్పుడు లబోదిబో అంటే లాభం లేదు. మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటాను. ఈ పోరాటం రాజగోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి మధ్య కాదు. రెండు భావజాలల మధ్య జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు." - కేటీఆర్, మంత్రి
అన్నం పెట్టిన వారెవరో.. సున్నం పెట్టేవారెవరో చూసి ఓటు వేయాలి: భాజపాపై మంత్రి హరీశ్‌రావు అన్నం పెట్టిన వారెవరో.. సున్నం పెట్టేవారెవరో చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. మునుగోడులో తెరాస అభ్యర్థి గెలుపు ఖాయమైందని స్పష్టం చేశారు. మునుగోడులో మహిళల కష్టాలు తీర్చిన పార్టీ తెరాస అని గుర్తించాలని పేర్కొన్నారు. నీళ్లిచ్చిన కేసీఆర్‌ను సాదుకోవాలా? సంపుకోవాలా?.. తేల్చుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకుని రాజగోపాల్‌రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులు తెచ్చుకున్నారని ఆరోపించారు.