KCR COMMENTS IN CHANDURU MEETING: కొందరు దిల్లీ బ్రోకర్‌లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూస్తే.. మన ఎమ్మెల్యేలు ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డలోలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మునుగోడులో అవసరం లేని ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక ఫలితాన్ని మునుగోడు ప్రజలు ఎప్పుడో తేల్చేశారు. ఎన్నికలు రాగానే లొల్లి మొదలవుతుంది. గాయిగాయి గత్తర్ గత్తర్ చేస్తారు.. విచిత్ర వేషధారులందరూ ఎన్నికలప్పుడు వస్తారు. ఎవరు ఏమి చెప్పినా నిజానిజాలపై ప్రజలు విస్తృతంగా చర్చించాలి. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఇల్లు కాలిపోతుంది. ఆలోచించి ఓటు వేస్తే మన ఊరు, మునుగోడు, మన జిల్లా, మన దేశం బాగుపడుతుంది. దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు బాగా ఆలోచించుకోవాలి. గాయిగాయి గత్తర్ గత్తర్ కావొద్దు. కరిచే పాములను మెడలో వేసుకునేందుకు సిద్ధపడతారా?
చేనేత కార్మికులు తగిన బుద్ధి చెప్పాలి...కొందరు దిల్లీ బ్రోకర్‌లు మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారు. ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు మేం తెలంగాణ బిడ్డలమని నలుగురు ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ బావుటా ఎగురవేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలు దేశానికి కావాల్సింది. రూ.100 కోట్లు ఇస్తామని ఆశ చూపితే.. గడ్డిపోచలా విసిరేశారు. దిల్లీ నుంచి దుర్మార్గమైన పని చేసి చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలదోయాలని భాజపా చూస్తోంది.
దేశాన్ని పాలించే అవకాశం ఇచ్చినా. రాష్ట్రాల్లో కుట్రలు ఎందుకు? ప్రజలు మోదీని రెండుసార్లు ప్రధానిని చేసినా ప్రభుత్వాలను ఎందుకు కూల్చాలి. ఎమ్మెల్యేలను కొనేందుకు భాజపాకు రూ. వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. దేశంలో ఏ ప్రధాని చేయని దారుణాలు ప్రధాని మోదీ చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని మోదీ. కేంద్రానికి బుద్దిరావాలంటే చేనేత కుటుంబాలు భాజపాకు ఒక్క ఓటు కూడా వేయొద్దు. చేనేత కార్మికులు తగిన బుద్ధి చెప్పాలి.
కొంత మంది దిల్లీ బ్రోకర్‌గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్నే కొందామనే ఉద్దేశ్యంతో మీకు రూ.100కోట్లు ఇస్తాము పార్టీ విడిచిపెట్టి రమ్మంటే.. ఎడమ కాలి చెప్పుతో తన్ని మేము అమ్ముడు పోము రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదురా.. మేము అసలైన తెలంగాణ బిడ్డలమని మన ఎమ్మెల్యేలు నలుగురు రుజువు చేశారు. అంగట్లో సరకుల్లా అమ్ముడుపోకుండా గడ్డిపోచతో సమానంగా విసిరికొట్టారు. వీళ్లు నిజమైన తెలంగాణ బిడ్డలు అంటే.. అన్ని వందల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి. ప్రధానమంత్రి పదవి కన్నా ఉన్నతమైనవా ఇవి.. రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యావు ఇంకా పదవిపై వ్యమోహం పోలేదా మోదీ అని అంటున్న. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై విచారణ జరగాలి. అందుకు బాధ్యులు బయట ఉండకూడదు.-కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి
భాజపాకు డిపాజిట్ వచ్చినా నన్ను పక్కకు నెట్టేస్తారు?..దేశంలో 4లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదు.కానీ, విద్యుత్ సంస్కరణల ముసుగులో మీటర్ల పెట్టాలని కేంద్రం చూస్తోంది. బావి వద్ద మోటార్లతో పాటు ఇళ్లలోనూ మీటర్లు మార్చాలని మోదీ చూస్తున్నారు. రూ.30వేలు చెల్లించి ఇంట్లో మీటరు మార్చుకోవాలని మోదీ ఆదేశాలు జారీ చేశారు. మీటర్లు పెట్టుకుని కొంపలు ఆర్పుకుందామా? మీటర్లు పెడదామనుకన్న వారికి మీటరు పెడదామా? భాజపాకు ఓటు వేస్తే. విద్యుత్ చట్టాలకు అం గీకరించినట్టే. భాజపాకు డిపాజిట్ వచ్చినా నన్ను పక్కకు నెట్టేస్తారు? ఆశ పడితే గోస పడతాం.