తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండటం మాకు శాపమా ?

లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్​ కళాశాలల్లో వారు చేరలేరు. పెద్ద పెద్ద భవంతుల్లో చదువుకోవడం ఆ విద్యార్థులకు కల. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలే వారికి ఆధారం. అలాంటి పేద విద్యార్థులకు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దుప్పట్లు కూడా సరిగా లేక కటిక నేల మీద నిద్రిస్తున్నాం: విద్యార్థులు

By

Published : Mar 28, 2019, 4:49 PM IST

Updated : Mar 28, 2019, 4:54 PM IST

బీసీ బాలుర వసతి గృహంలో మౌలిక వసతులు సమకూర్చాలి : విద్యార్థులు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లోని బీసీ బాలుర వసతి గృహం పక్కనే మురికి కాలువ ఉంది. అక్కడ్నుంచి వచ్చే దుర్వాసన భరించలేక విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. విపరీతమైన దోమలతో తరచూ వాంతులు, జ్వరాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. హాస్టల్​లో ఫ్యాన్లు కూడా సక్రమంగా పని చేయట్లేదు. అక్కడ ఉండలేక... ఇంటికి వెళ్లలేని సందిగ్ధంలో ఉన్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

హాస్టల్​లోకి వస్తున్న పాములు

వసతి గృహంలో మంచాలు లేక, నేల మీదే పడుకోవాల్సి వస్తోందన్నారు. శీతాకాలంలో అయితే వణకుతూ గడపాల్సిందే. దుప్పట్లు కూడా సరిగా లేక కటిక నేల మీద నిద్రిస్తున్నామని అన్నారు. చుట్టూ చెత్తా చెదారం వల్ల పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తినటానికి పళ్లాలు సరిపోక ఒకరు తిన్నాక మరొకరు తినాల్సిన దుస్థితిలో ఉన్నామని వాపోయారు.

మరుగుదొడ్లకు తలుపులు లేవు. కుళాయిలు సక్రమంగా పనిచేయవు. ఇదేమిటని ప్రశ్నించడానికి హాస్టల్ వార్డెన్ కూడా అందుబాటులో ఉండరు.

ఇంకెన్నాళ్లు ఇలా?

గతంలో ఇక్కడ 100 మందికి పైగా విద్యార్థులు ఉండేవారు. వసతుల లేమితో ఒక్కొక్కరుగా ఇంటి బాట పడుతున్నారు. ప్రస్తుతం 60 మంది విద్యార్థులు ఉంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 16 సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో 10కిపైగా హాస్టల్లో కిటికీలు, తలుపులు లేవు.అధికారులు తక్షణం స్పందించి తమకు మౌలిక వసతులు సమకూర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఇవీ చూడండి :ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు


Last Updated : Mar 28, 2019, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details