రాష్ట్రంలో రోజురోజుకు ఇసుకకు డిమాండ్ పెరగడటం వల్ల అందినకాడికి దుండుకునేందుకు అక్రమార్కులు... అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో వాగులు, నదీ తీరప్రాంతాల నుంచి ఇసుకను తీసుకురాగా.. ప్రస్తుతం చెరువులను వదిలిపెట్టడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా తంగడపల్లి పెద్దచెరువుపై ఇసుక మాఫియా కన్నేసింది. 10 వేల జనాభా ఉన్న ఆ గ్రామం ఇటీవలే చౌటుప్పల్ పురపాలక సంఘంలో విలీనమైంది. చెరువులు, ఖాళీ స్థలాలు ఆక్రమించుకనేందుకు రాజకీయ నేతల అండదండలతో కొందరు దళారులు ఇసుక దందా సాగిస్తున్నారు. ఏడేళ్లుగా చెరువు నిండకపోవడం వల్ల పెద్ద పెద్ద తుమ్మ చెట్లు మొలిచాయి. వాటిని అవకాశంగా తీసుకొని యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల తాగు, సాగునీటి కోసం రైతులు, ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.
లోతులో నుంచి ఇసుక
చెరువు సమీపంలోని గుంతలు చూసేందుకు చిన్నగా ఉన్నా లోపలకు వెళ్లి చూస్తే భయపడాల్సిందే. ఒక్కోటి 15 నుంచి 20 అడుగుల లోతులో నుంచి ఇసుకను తవ్వి బయటకు తీస్తున్నారు. గుంతల లోపల రెండు మూడు వైపులా తవ్వి ఇసుక నింపిపైకి ఇస్తుంటే మరికొందరు జల్లడ పట్టి కుప్పపోస్తారు. మరొకరు ఎవరైనా వస్తున్నారా అంటూ పర్యవేక్షిస్తున్నారు. ఆ విషయంపై ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏదో పార్టీ నేత వచ్చినిందితులకు అండగా ఉంటున్నారు. రాజకీయనేతలు సహకరిస్తుడటం వల్ల చెరువు సంరక్షణపై స్థానికులు ఆశలు వదిలేసుకున్నారు.