తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. గాంధీ జయంతి, సెలవు దినం కావడం వల్ల స్వామివారి దర్శనానికి భక్తులు అధికంగా తరలివస్తున్నారు. దీంతో స్వామి వారి దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పడుతోంది.
భక్తుల సంఖ్య అధికంగా ఉన్నందున ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఆలయంలోని క్యూ లైన్లు, ప్రసాదాల కౌంటర్, కొండపైన బస్టాండ్ ప్రాంగణంలో ఆలయ ఘాట్ రోడ్డు వెంట, వాహనాల పార్కింగ్ వద్ద అధికంగా రద్దీ కనిపించింది.
కరోనా వైరస్ కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించే క్రమంలో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనల కారణంగా కేవలం దర్శనాలకు మాత్రమే భక్తులను పరిమితం చేశారు ఆలయ అధికారులు. స్వామి వారికి నిర్వహించే ఆర్జిత సేవలు ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తుల గోత్ర నామాలతో లఘు దర్శనాలు కల్పిస్తున్నారు. మరోవైపు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించట్లేదు.
ఇదీ చదవండి:'యాదాద్రి ఆలయాన్ని పునర్మించడానికే కేసీఆర్ జన్మించారనేలా పనులు'