భూగర్భ జలాలు పెరగడం వల్ల యాదాద్రి జిల్లాలోని గుండాలలో గత రబీకి సంబంధించి 2,050 ఎకరాల్లో వరి సాగైంది. ఖరీఫ్ సీజన్లో 3,050 ఎకరాలకు సాగు చేశారు. ప్రస్తుత రబీలో అది 4,605 ఎకరాలకు పెరిగింది. రైతులు పెద్ద ఎత్తున వరి సాగు మెుదలెట్టి నాట్లు కూడా పూర్తి చేశారు. జిల్లాలోని 17 మండలాల్లో వరి సాగు విస్తీర్ణమే గణనీయంగా పెరిగింది.
వర్షాలు సమృద్ధిగా కురవడం, గోదావరి జలాలు వస్తుండటం వల్ల ఖరీఫ్‌తో పోల్చుకుంటే మూడు మీటర్ల మేర భూగర్భ జలం ఉబికి వచ్చింది. దీనికి తోడు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా అవుతోంది. మూసీ ఆయకట్టులోని భూదాన్ పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్, రామన్నపేట, భువనగిరి మండలాల్లో ఏటా వరి సాగు విస్తీర్ణం ఇంచుమించుగా ఒకే విధంగా సాగవుతోంది. ఈసారి జనగామ జిల్లా నవాబ్ పేట రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలతో గుండాల మండలంలోని చెరువులు నింపారు. తపస్ పల్లి రిజర్వాయర్ కాలువల ద్వారా రాజాపేట, ఆలేరు మండలాల్లోని కొన్ని చెరువులు నింపారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండి భూగర్భజలాలు అమాంతం పెరిగాయి. రబీలో 36,939 హెక్టార్లలో వరి సాగు అవుతోందని వ్యవసాయ అధికారుల అంచనా. కానీ అది 54,800 హెక్టార్లకు పెరిగింది.