ఏడు గోపురాల వైభవం.. యాదాద్రీశుడి ఆలయం Yadadri Temple Reopening : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అద్భుత రీతిలో దివ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్ సంకల్పంతో.. 2016లో ఓ గొప్ప యజ్ఞం ప్రారంభమైంది. తక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆలయాన్ని విస్తరించి విశాలంగా అభివృద్ధి చేశారు. పనులు చకచకా మొదలై, వైభవంగా.. భవ్య నిర్మాణాలతో మెరుగులు దిద్దుకుంది. సంకల్పబలం, అద్భుత ప్రణాళికలు, యంత్రాంగం కార్యాచరణ, వందలాది శిల్పుల నైపుణ్యం, కార్మికుల కఠోర శ్రమతో యాదాద్రి పంచనారసింహ క్షేత్రం గొప్పగా రూపుదిద్దుకుంది. మహాక్షేత్రమంతటి హరినివాసం సిద్ధమైంది.
గర్భాలయాన్ని కదపకుండా : 1200 కోట్ల వ్యయంతో సాకారమైంది ఈ కలల ప్రాజెక్టు. అనుకున్న సమయానికి పూర్తి చేసి అద్భుత దేవాలయాన్ని కళ్లముందు నిలబెట్టారు. స్వయంభూవులు కొలువున్న గర్భాలయాన్ని ఏమాత్రం కదపకుండా, ముట్టుకోకుండా ఆలయాన్ని విస్తరించారు. కేవలం ఆరేళ్లలో పాంచరాత్ర, ఆగమ, శిల్ప, వాస్తుశాస్త్రాలకు అనుగుణంగా దివ్యాలయం పూర్తైంది.
ఏడు గోపురాల వైభవం : కాకతీయ కళాతోరణాలు, దేవతామూర్తులు, అష్టలక్ష్మి రూపాలతో సాలాహారాలు, వైష్ణవ తత్వాన్ని నలుదిశలా చాటిన ఆళ్వారుల విగ్రహాలు.. భక్తజనులను అబ్బురపరిచేలా, జగమంతా అభివర్ణించేటట్లు యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంగా ఆవిష్కృతమైంది. ప్రధాన ఆలయాన్ని సువిశాలంగా విస్తరించి మాఢ వీధులు, అష్టభుజి మండప ప్రాకారాలు.. తూర్పున బ్రహ్మోత్సవ మండపం, పశ్చిమ దిశలో వేంచేపు మండపంతో తీర్చిదిద్దారు. ఉగ్ర, భేరుండ, జ్వాలా, యోగానంద, లక్ష్మీనరసింహ..! ఈ ఐదు రూపాల పంచనారసింహ క్షేత్రం.. యాదాద్రి మహాక్షేత్రమైంది. దేశవిదేశాల్లోని భక్త జనమంతా.. విస్తుబోయేంత వినూత్న రీతిలో దర్శనమిచ్చేందుకు సిద్ధమైంది. గుహల్లో వెలిసిన స్వామికి ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 7 గోపురాల వైభవం కలిగింది. నలు దిశలా రాజ గోపురాలు.. అల్లంత దూరం నుంచే కన్పించేలా సాక్షాత్కారమయ్యాయి.
బంగారు పూతతో సింగారం : ఆలయ వాస్తు నిర్మాణ శాస్త్రంలో 16 రకాల గోపురాలుంటే.. వాటిలో 3 రకాల గోపురాలు యాదాద్రి ఆలయంలో మాత్రమే ఉన్నాయి. గర్భాలయ నారసింహుడు పశ్చిమం వైపు చూస్తున్నట్లుంటాడు కనుక పశ్చిమ మాఢ వీధి, పశ్చిమ మహారాజగోపురం, వేంచేపు మండపాలకు ఎనలేని ప్రాముఖ్యతను నిర్మాణంలోనే చూపారు. 72 అడుగుల ఎత్తైన ఏడంతస్తుల సప్తతల ఆగమ మహారాజ గోపురం ఇది. దీని తర్వాత పశ్చిమ, ఉత్తర, తూర్పు, దక్షిణ రాజగోపురాలు 55 అడుగుల ఎత్తైన పంచతల గోపురాలుగా చిద్విలాసంగా ఉన్నాయి. అంతర మాఢ వీధిలోనే ఈశాన్యాన ఉన్న త్రితల మూడంతస్తుల చిరు రాజగోపురం అంతరాలయంలోకి తీసుకెళ్తుంది. 33 అడుగుల ఈ త్రితల గోపురం కూడా బహు శిల్పమయంగా కనిపిస్తోంది. ఇక ఏడో గోపురం.. స్వామి వారి గర్భాలయంపై ఉండే విమాన గోపురం. ఇది.. 45 అడుగులతో నరసింహుని కిరీటమానమై వెలుగొందుతోంది. అందుకే ఈ భవ్య విమానం బంగారు పూతతో సింగారమవుతోంది.
Yadadri Temple News : ఆలయానికి బాహ్య, అంతర్ ప్రాకారాలు సువిశాలంగా నిర్మించారు. అద్భుత శిల్పకళతో తీర్చిదిద్దిన మండపాలు.. ఈ హరి నివాసానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. లోపల, వెలుపల నిర్మించిన మండలాలు.. క్షేత్ర వైభవానికి ప్రతీకలుగా నిలుస్తాయి. గర్భగుడి ఎదురుగా రెండంతస్థుల మేర ఉండే మహా మండపం, ముఖ మండపం.. వైభవాన్ని కనులారా వీక్షించాల్సిందే. ఆలయం గర్భగుడిలో చిత్రీకరించిన స్వామి వారి పరిణయోత్సవ దృశ్యం, ప్రహ్లాద చరిత్ర.. మరింత ప్రత్యేకం. తంజావూరు కళాకారులు రూపొందించిన కళా దృశ్యాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. గోపుర ద్వారాలకు ఇత్తడి, బంగారు తొడుగులు తొడిగారు. సువర్ణమయమైన గర్భగుడి ద్వారం మిరుమిట్లు గొలుపుతోంది. గోపురాలపై ఏర్పాటు చేసిన స్వర్ణ, రాగి కలశాలు కాంతులీనుతున్నాయి.