దసరా పండుగకు సొంత గ్రామాలకు వెళ్లిన పట్టణ వాసులు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ వెళ్లే మార్గంలో కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఫాస్ట్ ట్యాగ్ పద్ధతి అమల్లో ఉండడంతో వాహనాలు నిమిషాల వ్యవధిలోనే టోల్ గేట్ నుంచి వెళ్లిపోతున్నా.. రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్ వైపు వచ్చే వాహనాల సంఖ్య పెరగడంతో జాతీయ రహదారిపై రద్దీ మరింత పెరుగుతోంది.
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి హైదరాబాద్ చేరుకుంటుండంతో జాతీయరహదారి కిక్కిరిసిపోయింది. పండక్కి ఊరెళ్లిన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉదయం నుంచే హైదరాబాద్ పయనమవడంతో విజయవాడ-హైదరాబాద్ మార్గంలో రద్దీ అధికమైంది. సాయంత్రానికి వాహనాల రద్దీ మరింత పెరిగింది. కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చౌటుప్పల్‌లో అండర్‌పాస్ వంతెన లేకపోవడంతో పండుగ వేళ, శుభకార్యాలు ఎక్కువగా ఉన్న రోజుల్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది.