Heavy Rush at Yadadri Temple: యాదాద్రిలో లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. బాలాలయ సముదాయాలు, మండపాలు సందడిగా కనిపించాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రిలో రద్దీ నెలకొంది. నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. రద్దీ దృష్ట్యా అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించలేదు. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తుల రద్దీ కారణంగా లడ్డు ప్రసాద కౌంటర్ భక్తులతో నిండిపోయింది. లడ్డు కొనుగోలు చేసిన భక్తులకు కవర్లో ఇవ్వకుండా నేరుగా చేతికి లడ్డూలు ఇవ్వడంతో అసహనానికి గురయ్యారు. అనంతరం దాదాపు అరగంటకు పైగా లడ్డు ప్రసాదం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.
ఉదయం నాలుగు గంటలకే పూజలు ప్రారంభం
Heavy rush at yadadri temple: ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మొదలైంది. ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.