తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri: నారసింహుని సన్నిధిలో భక్తుల రద్దీ

శ్రావణమాసం(sravana masam).. మరోవైపు సెలవురోజు కావడంతో నారసింహుని(sri lakshmi narasimha swamy)చెంతకు భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం ఆదివారం ఉదయం నుంచే బారులు తీరారు. ధర్మ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. మరోవైపు ఆలయ పునర్నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

devotees flow at Yadadri temple, sri lakshmi narasimha swamy temple
యాదాద్రిలో భక్తుల రద్దీ, శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయం

By

Published : Aug 29, 2021, 12:18 PM IST

Updated : Aug 29, 2021, 1:16 PM IST

శ్రావణమాసం మూడో ఆదివారం యాదాద్రి(yadadri) క్షేత్రం భక్తజనులతో కిటకిటలాడింది. ఇవాళ ఉదయం నుంచి భక్తులతో కొండపై బాలాలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. మొక్కు పూజలతో మండపాలలో రద్దీ నెలకొంది. స్వామివారి నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. శ్రీస్వామి నిత్యకల్యాణంలో అధిక సంఖ్యలో జంటలు పాల్గొని... మొక్కులు తీర్చుకున్నారు.

సందడిగా ఆలయ పరిసరాలు

భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. స్వామివారి ధర్మ దర్శనానికి2 గంటలు సమయం... ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామిని(sri lakshmi narasimha swamy temple) రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ తిరుమల రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

ప్రసాదాలకు యంత్రాలు

విశ్వఖ్యాతి చెందేలా పునర్నిర్మితమవుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి పుణ్యక్షేత్రంలో స్వామివారి లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీకి యాదాద్రి ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకొంటోంది. అధునాతన యంత్రాలతో ప్రసాదం తయారు చేసేలా రూ.13కోట్లతో భారీ యంత్రాలను కొనుగోలు చేసింది. అక్షయపాత్ర పర్యవేక్షణలో బిగింపు పనులు జోరుగా కొనసాగుతున్నాయి.

పసిడి వర్ణంలో యాదాద్రి

కృష్ణశిలతో రూపొందిన యాదాద్రి పంచనారసింహుల ఆలయ సన్నిధిలో పసిడి వర్ణంలో వివిధ వనరులను సమకూరుస్తున్నారు. స్తంభోద్భవుడి సన్నిధి సహజసిద్ధంగా ఆవిష్కృతం కావాలన్నదే సీఎం కేసీఆర్‌(cm kcr) ప్రధానాశయం. ఒకే జాతికి చెందిన కృష్ణశిలతో పంచనారసింహులు కొలువైన ఆలయ ప్రాంగణాన్ని రూపొందించారు. ఇంకెక్కడా లేని తరహాలో అష్టభుజ మండప ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయ విశిష్టత నలుదిశలా వ్యాపించేలా వివిధ వనరుల కల్పనకు వైటీడీఏ(YTDA) శ్రమిస్తోంది. అద్దాల మండపం, దర్శన వరుసలతో కూడిన మందిరం, రాజగోపురాల ద్వారాలకు తలుపులు, ప్రత్యేక విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి.

సంప్రదాయ హంగులు

భక్తజన సందోహం ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాదాద్రి ఆలయం ముస్తాబవుతోంది. శివాలయం రథశాలను సంప్రదాయ హంగులతో తీర్చిదిద్దేందుకు యాడా కసరత్తు చేస్తోంది. శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని పునర్నిర్మించగా.. ఇక్కడ 32 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో నిర్మితమైన శివపార్వతుల రథశాలను తీర్చిదిద్దుతున్నారు. వివిధ ఉపఆలయ ద్వారాలకు ఇత్తడి తొడుగులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఫ్లవర్ నగిషీలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

ఇదీ చదవండి:

Last Updated : Aug 29, 2021, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details