Heavy rush in Yadadri: కార్తిక మాసం, ఆదివారం సెలవు దినాలు కావడంతో యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కళకళలాడాయి. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హరిహరులు కొలువైన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ప్రత్యేక, బ్రేక్ దర్శనాలకు భక్తులు వరుస కట్టారు. ఉచిత దర్శనానికి దాదాపు మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. అలాగే బ్రేక్ దర్శనం విభాగంలోనూ రద్దీ కనిపించింది. లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. కార్తికమాసం కావడంతో స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణంలో 100కు పైగా జంటలు పాల్గొని, కొండ దిగువన మండపంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు.