తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసు వాయిదాతో.. హాజీపూర్ వాసుల్లో నిరాశ

ఉదయం నుంచి హాజీపూర్ గ్రామస్థులంతా ఒక్కచోటు సమవేశమయ్యారు. ముగ్గురు బాలికలను కడతేర్చిన ఆ నరరూప రాక్షసుడికి  పడే శిక్ష కోసం ఎదురు చూశారు. తీర్పు ఫిబ్రవరి 6కు వాయిదా పడటం వల్ల ఒక్కసారిగా నిరాశ చెందారు.

By

Published : Jan 27, 2020, 11:44 PM IST

hazipur case
కేసు వాయిదాతో.. హాజీపూర్ వాసుల్లో నిరాశ

కేసు వాయిదాతో.. హాజీపూర్ వాసుల్లో నిరాశ

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస రెడ్డిని ఉరి తీయాలంటూ గ్రామస్థులు కోరుతున్నారు. ఈ కేసుకు సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణను పూర్తి చేసింది. ప్రాసిక్యూషన్ కూడా నిందితుడు శ్రీనివాస్ రెడ్డి... ఉరిశిక్షను అన్ని విధాలా అర్హుడని వాదించింది. కేవలం తన లైంగిక వాంఛలు తీర్చుకోవడం కోసమే మూడు హత్యలు చేసిన వ్యక్తి సమాజంలో ఉండటం శ్రేయస్కరం కాదని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది తెలిపారు. కానీ కోర్టు తీర్పును ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేయడం వల్ల హాజీపూర్ గ్రామస్థులంతా తీవ్ర నిరాశ చెందారు.

ఎంతో ప్రశాంతగా ఉండే ఊళ్లో శ్రీనివాసరెడ్డి అనే ఓ నరరూప రాక్షసుడు ముగ్గరు బాలికలను పొట్టనబెట్టుకున్నాడు. ఊరి చివర తన పొలంలో కాపు కాచి స్కూలు నుంచి, కళాశాలల నుంచి వస్తున్న బాలికలను లక్ష్యంగా చేసుకొని... తన బండి మీద లిఫ్ట్ ఇస్తానంటూ బావి వద్దకు తీసుకువ వచ్చి అత్యాచారం... ఆపై హత్య చేశాడు. అలాంటి వాడికి వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని బంధువులు, గ్రామస్థులు కోరుతున్నారు.

గత సంవత్సరం ఏప్రిల్​లో మృతుల్లో ఓ యువతి కేసు దర్యాప్తులో భాగంగా... మరో రెండు హత్యలు కూడా శ్రీనివాస్ రెడ్డే చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అతని ఇంటిని ధ్వంసం చేశారు. హజీపూర్ నుంచి బొమ్మల రామారం వైపు వెళ్తుంటే... ఆ చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తొస్తున్నాయని బంధువులు చెబుతున్నారు.

అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలను ఇంత కిరాతకంగా చంపిన శ్రీనివాస రెడ్డికి ఉరే సరైన శిక్షని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అంటున్నారు. ఆ రాక్షసుడికి ఎటువంటి శిక్ష పడుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే...

ఇవీ చూడండి: తెరాస ఖాతాలో 10 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీలు

ABOUT THE AUTHOR

...view details