భక్త జనుల మానసిక పునరుత్తేజానికి యాదాద్రి పంచ నారసింహ క్షేత్రం మహా దివ్య పుణ్యక్షేత్రంగానే గాకుండా హరితమయ ప్రాంగణంగానూ రూపుదిద్దుకుంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ఈ క్షేత్రాన్ని ప్రపంచ ఖ్యాతి చెందేలా అభివృద్ధి పరిచేందుకు యాడా(యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికారిక సంస్థ) యత్నిస్తోంది. విశాల రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో గ్రీనరీ పోషణను అధికారులు చేపట్టారు. ఒకనాటి రాళ్ల గుట్టను సుందరమయమైన "ఆలయ నగరి"గా రూపొందించారు. రకరకాల పూల మొక్కల పెంపకంతో ఆ ప్రాంగణం యాత్రికులకు వాహ్యాళి కేంద్రంగా అలరిస్తోంది.
చుట్టూ పచ్చదనం
ఈ క్షేత్రానికి వచ్చే యాత్రికుల కోసం ఏర్పాటైన రహదారుల్లో ఇరువైపులా మానసిక ప్రశాంతత కలిగించేలా హరితమయంగా ఇప్పటికే యాడా అధికారులు తీర్చిదిద్దారు. యాదాద్రికి 6 కి.మీ. దూరంలోని రాయగిరి నుంచి రహదారులన్నీ హరితమయంగా దర్శనమిస్తూ స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు రాకపోకల్లో ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. మృగ నరహరి కొలువై ఉన్న కొండ చుట్టూ ఆకుపచ్చదనంతో ప్రకృతి అందం ప్రస్ఫుటమయ్యేలా వివిధ మొక్కలు, పచ్చిక బయళ్లతో రూపొందించారు. కొండకు దక్షిణ దిశలో రాతి కనిపించకుండా పచ్చదనంతో నిండిపోయింది. యాదాద్రికి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మికతో పాటు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా యాడా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ప్రజారోగ్య పరిరక్షణకే హరిత హారం
లోక సంరక్షకుడి క్షేత్ర పరిధిలో మానవాళి మనుగడ కోసం అనుగుణంగా ఆహ్లాదకర వాతావరణం కలిగించేందుకు హరితహారం ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత స్పష్టం చేశారు. భక్తులెందరికో ఇలవేల్పుగా మారిన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా, వాతావరణం ప్రజారోగ్యానికి అనుకూలంగా ఉండేలా వివిధ మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం సూచనలతో స్థానికంగా "యాడా" చేపట్టడం హర్షణీయమని ప్రభుత్వ విప్ అన్నారు.