యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ శివారులో చోటుచేసుకున్న బాలికల దారుణ హత్యల కేసుల్లో నేడు తీర్పు వెలువడనుంది. ముగ్గురు విద్యార్థినుల్ని పాశవికంగా హత్యాచారం చేసిన ఘటనల్లో... నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. లైంగిక నేరాల నుంచి చిన్నారుల్ని కాపాడే పోక్సో చట్టం కింద కేసులు నమోదు కావడం వల్ల... నల్గొండలోని మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానంలోని పోక్సో చట్టం కోర్టులో విచారణ సాగింది. నూటా ఒక్క మంది సాక్షుల వాంగ్మూలాలతో పాటు.. డీఎన్ఏ పరీక్షలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికల్ని... పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.
గత డిసెంబరు 28తో పాటు ఈ నెల 6, 7, 8 తేదీల్లో... తుది వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.చంద్రశేఖర్... నిందితుడి తరఫున డిఫెన్స్ న్యాయవాది రవీంద్రనాథ్ ఠాగూర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నేడు తీర్పు వెలువరించనున్నారు.
గతేడాది మార్చి 9న ఒక బాలిక... ఏప్రిల్ 25న మరో బాలిక... 2015 ఏప్రిల్‌లో ఇంకో బాలిక... ఇలా బొమ్మలరామారం మండలం హాజీపూర్ శివారులో ముగ్గురు మైనర్లు అదృశ్యమయ్యారు. గతేడాది ఏప్రిల్ 26న హాజీపూర్ శివారులోని పాడుబడ్డ బావిలో... ఒక బాలిక మృతదేహం లభ్యమైంది. ఆ రోజునే నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలు సైతం సమీప బావుల్లో బయటపడ్డాయి. శ్రీనివాస్ రెడ్డే హత్యాచారం చేసి బావుల్లో వేసి మట్టి పోసి మరీ దారుణాలకు పాల్పడినట్లు గుర్తించిన రాచకొండ కమిషనరేట్ పోలీసులు... పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురు అమ్మాయిలే కాకుండా గతంలో లిఫ్ట్ మెకానిక్ గా పనిచేసిన సమయంలో శ్రీనివాస్ రెడ్డి... మహిళను హత్య చేశాడంటూ ప్రాసిక్యూషన్ వాదించింది.
పోలీసులు అందజేసిన సాక్ష్యాల్లో పసలేదని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. ఇలా ఇరుపక్షాల వాదనల్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం... తీర్పు వెలువరించనున్నట్లు ఈ నెల 17న ప్రకటించింది.
హాజీపూర్ హత్యోదంతం: నేడు తుది తీర్పు ఇవీ చూడండి: రాజ్భవన్లో ఎట్హోం... సీఎం సహా ప్రముఖుల హాజరు