యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అత్యంత అద్భుతంగా తీర్చి దిద్దేందుకు యాడ కార్యాచరణ ప్రారంభించింది. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పం, ప్రభుత్వ సహకారంతో ఆలయ పునర్నిర్మాణం శరవేగంగా సాగుతోంది. స్వయంభు క్షేత్రంగా విరాజిల్లుతున్న నారసింహుని క్షేత్రాన్ని సంపూర్ణ కృష్ణ శిలతో పునర్నిర్మించారు. స్వర్ణ భూషణాలతో తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. గర్భాలయంపై 45 అడుగుల ఎత్తులో కృష్ణ శిలతో నిర్మించిన దివ్య విమానాన్ని స్వర్ణమయం చేయాలని ప్రణాళిక రూపొందించారు. సుమారు 45 కిలోల బంగారం అవసరమని అధికారులు గుర్తించారు.
అంతా స్వర్ణమయం
ప్రస్తుతం వినియోగిస్తున్న ఎనిమిదిన్నర అడుగుల ఎత్తున్న టేకు కలప రథానికి దాతల సహకారంతో బంగారు తొడుగులు తయారు చేస్తున్నారు. 17 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పుతో గల గర్భగుడి మహాద్వార తలుపులను బంగారంతో తీర్చి దిద్దనున్నారు. పెంబర్తి కళాకారులతో ఇత్తడి తొడుగులు రూపొందించి వాటికి బంగారు తాపడం చేస్తారు. ఆలయంలో నిత్య కైంకర్యాలకు వినియోగించే పాత్రలు, అభిషేకం జల్లెడ స్తాంబాలం, శంఖం, చెడి మంత్రదండం, వైభోగ మూర్తులు, శఠారి కల్యాణ సామాగ్రి అన్నింటినీ బంగారు పూతతో సిద్ధం చేయాలని యోచిస్తున్నారు. నిత్య ఆరాధనలో బిందె, గర్భాలయంలోని మూలవర్యులకు స్వర్ణకవచాలు, 50 అడుగుల ఎత్తులో గల ధ్వజస్తంభం, బలిపీఠాన్ని స్వర్ణమయం చేసేందుకు కవచాలు తయారు చేస్తున్నారు.