యాదాద్రి పంచ నారసింహ పుణ్యక్షేత్ర(Yadadri renovation) అభివృద్ధి పనుల్లో భాగంగా గర్భగుడి ప్రధాన ద్వారాలనూ స్వర్ణమయం చేస్తున్నారు. 17 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పుతో టేకు కలపతో ఏర్పాటు చేసిన రెండు తలుపులకు బంగారు తాపడం(Yadadri renovation) చేసే పనులు పూర్తికావొచ్చాయి. ఆలయానికి చెందిన 16 కిలోల బంగారంతో చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో స్వర్ణ కళాకారులు తొడుగులు రూపొందిస్తున్నారు. రెండు తలుపులపై ఆధ్యాత్మికత ఉట్టిపడేలా 28 పద్మాలు, 14 నారసింహ రూపాలు, ద్వారానికి ఇరువైపులా జయవిజయులు, శంఖం, చక్రం, తిరునామాలు, 36 గంటలను తీర్చిదిద్దారు. తుదిమెరుగులు దిద్దాల్సిన ఈ స్వర్ణ ద్వారాలను సీఎం కేసీఆర్ మంగళవారం పరిశీలించారు.
100 ఎకరాల యాగ స్థలం ఎంపిక
యాదాద్రి(Yadadri renovation) ఆలయ ఉద్ఘాటన తేదీ మార్చి 28, 2022న ఖరారైన నేపథ్యంలో మహా సంప్రోక్షణ నిర్వహణపై 'యాడా' దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిర్వహించే సుదర్శన మహా యాగం కోసం కొండ కింద ఉత్తర దిశలో సుమారు 100 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసింది. ఈ ప్రాంగణాన్ని చదును చేసి యాగ నిర్వాహకులకు అప్పగించనున్నారు. ఉద్ఘాటనకు సంబంధించిన ఏర్పాట్లపై హైదరాబాద్‌లో సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి యాడా యంత్రాంగంతో నేడు సమావేశం నిర్వహించనున్నారు.