భాగ్యనగరానికి చేరువలో భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోన్న ఆలయాన్ని అద్భుతమైన దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి తొలి అడుగు పడి సరిగ్గా నేటికి అర్ధ దశాబ్దం అవుతోంది. రెండు వేల ఎకరాల్లో ఆధ్యాత్మికంగా ఆహ్లాదకరంగా అన్ని హంగులతో... అంతర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుమల స్థాయిలో అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం.. ఈ ఐదేళ్లలో ఆలయ రూపురేఖలనే మార్చివేసింది.
ఆధారశిల నుంచి శిఖరం వరకు
- రాజుల కాలంనాటి అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యం.. ఆధార శిల నుంచి శిఖరం వరకు కృష్ణ రాతిశిలా నిర్మాణాలు... దేశంలో... ఎక్కడా లేనివిధంగా అష్టభుజి ప్రాకార మండపాలు, సప్త గోపుర సముదాయం, భాగవత పురాణ ఇతిహాసాలు, మహా పురుషులు, దేవతామూర్తుల విగ్రహాలు, రాతి స్తంభాల ముఖ మండపాలు, పాంచ నరసింహులు కొలువై ఉన్న కొండ గుహ గర్భాలయం.. దాని ముఖ ద్వారానికి ప్రహ్లాద చరితం... పాంచ నరసింహుల రాతి బొమ్మలతో అనేక విశేషాల మేళవింపుతో పనులు తుది దశకు చేరుకున్నాయి.
బీజం అక్కడే పడింది
తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని 2014 అక్టోబర్ 17న తొలిసారి సందర్శించారు కేసీఆర్. సాధారణంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారని అందరూ భావించారు కానీ హెలికాప్టర్లో యాదాద్రి ఆలయ పరిసరాల్లోని కొండలు.. గుట్టలను పరిశీలించిన ఆయన... అప్పుడే యాదాద్రి ఆలయాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయాలని సంకల్పించారు.
టెంపుల్ సిటీగా...
యాదగిరి క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని యాదగిరి కొండ చుట్టూ గల ఇతర కొండలు, చెరువులతో పాటు ప్రభుత్వ ప్రైవేటు భూములను సుమారు 2వేల ఎకరాలను సేకరించాలని అప్పటి జిల్లా కలెక్టర్ చిరంజీవులును ఆదేశించారు. రెండు వేల ఎకరాలలో నాలుగు వందల ఎకరాలు జింకల పార్కు అభివృద్ధికి, మిగిలిన స్థలంలో వేద పాఠశాల సాంస్కృతిక విద్యా పీఠం భవనంతో పాటు తిరుమల స్థాయిలో ల్యాండ్ స్కేప్ గార్డెన్లు, బహుళ అంతస్తుల వసతి గృహాలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు.
ఆధ్యాత్మిక విరాజిల్లే విధంగా
యాదగిరి కొండపై గల 14.11 ఎకరాలు ఆలయ విస్తరణకు, కొండను ఆవరించి ఉన్న 103 ఎకరాలను ల్యాండ్ స్కేప్ గార్డెన్లుగా అభివృద్ధికి వినియోగించాలని నిర్ణయించారు. కొండపై ఆలయ మండప విస్తరణ, గోపురాల పరిస్థితి, వసతి పార్కింగ్ అంశాలను దేవాదాయ శాఖ ఆమోదించిన మాస్టర్ ప్లాన్ను కేసీఆర్ పరిశీలించారు. యాదాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మికత విరాజిల్లే విధంగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకున్నారు.
11 సార్లు ఆలయ సందర్శన
ఆలయ అభివృద్ధి విస్తరణ, చేపట్టాల్సిన ప్రతి నిర్మాణ ప్రణాళికలను స్వీయ పరిశీలనలో రూపకల్పన చేశారు. దాదాపు పాతిక పర్యాయాలు అధికారులతో సమీక్షలు, 11 సార్లు ఆలయాన్ని స్వయంగా సందర్శించిన సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో మహిమాన్విత యాదాద్రి క్షేత్రం దేశంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైన రాతి శిల్ప నిర్మాణ ఆలయంగా రూపుదిద్దుకునే పనులు తుదిదశకు చేరుకున్నాయి..
కృష్ణ రాతి శిల సొబగులు...
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ ప్రాకారం నిర్మాణాలు కాకతీయుల శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడుతూ అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. ఆధార శిల నుంచి శిఖరం వరకు పూర్తిగా కృష్ణ రాతి శిలలతో ప్రధానాలయం, అంతర్ బాహ్య ప్రాకార మండపాలు, సప్త గోపుర సముదాయాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రధాన ఆలయం పడమటి పంచతల రాజగోపురం ఎదుట విజయోత్సవ మండపం పూర్తి కాగా సప్త తల మహా రాజగోపురం చెంత వేంచేపు మండపం తుది దశ పనులు కొనసాగుతున్నాయి.