యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్ మండలాల్లో కురిసిన వడగండ్ల వానకు రైతులు అధికంగా నష్టపోయారు. వానకాలంలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పెద్ద చెరువులు సైతం జలకళను సంతరించుకున్నాయి. వీటికితోడు మూసీ పరివాహక ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యాసంగిలో వరి పంటను అన్నదాతలు సాగు చేశారు. ఇరవై రోజుల వ్యవధిలో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు దాదాపు నాలుగైదు సార్లు కురవడం వల్ల ఇక్కడి రైతులకు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఒక్క వలిగొండ మండలంలోనే 1030 ఎకరాల్లో పంట నష్టం జరగ్గా... పోచంపల్లి మండలంలో 400 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. ఈ అకాల వర్షాల వల్ల యాదాద్రి జిల్లాలో 640 మంది రైతులు నష్టపోయారు. నల్గొండ జిల్లాలో కృష్ణపట్టి ప్రాంతాలైన పెద్దవూర, పీఏపల్లి, హాలియా, దేవరకొండ డివిజన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం తడిసింది.
పోచంపల్లి, భువనగిరి, ఆలేరు, వలిగొండల్లోని చాలా కేంద్రాల్లో రైతుల ధాన్యం 80 శాతానికిపైగా తడవడం వల్ల శనివారం ఆయా ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో పాటు అధికారులు సందర్శించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కర్షకులు అక్కడే ఆరబెడితే నిబంధనల ప్రకారం ప్రతి గింజా కొంటామని... రైతులెవరూ ఆందోళన చెందవద్దని మూడు జిల్లాల అధికార యంత్రాంగం భరోసానిస్తోంది.
బీమా లేకపాయే...
అకాల వర్షాలకు తోడు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు బీమా పరిహారం అందుతుంది. తొలుత రైతులు బీమాకు ప్రీమియం చెల్లించాలి. పంట రుణాల పంపిణీ సమయంలోనే బ్యాంకులు రైతుకిచ్చే రుణంలో బీమా ప్రీమియం మినహాయించుకొనేవి. ఫలితంగా పంట నష్టం జరిగితే బీమా కంపెనీలు రైతుకు పరిహారాన్ని ఇచ్చేవి. అయితే ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో పంట రుణాలను బ్యాంకులు చాలా తక్కువ సంఖ్యలో రైతులకు పంపిణీ చేశాయి. దాదాపు 50 శాతం రైతులు బీమా ప్రీమియం చెల్లించలేదు. పంట నష్టపోయిన ఈ అపత్కాలంలో రైతులకు పంట బీమా రాకుండా పోయింది.