యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్దపడిశాలకు చెందిన నామాల శారద, సోమయ్య దంపతులకు నాగలక్ష్మి, సతీశ్ సంతానం. తొమ్మిదేళ్ల క్రితం శారద అనారోగ్యంతో మృతి చెందింది. తరువాత ఏడాదే సోమయ్య కూడా మరణించాడు. తల్లిదండ్రులిద్దరూ దూరమవగా... ఆ చిన్నారులను మోత్కూరులో ఉంటున్న అమ్మమ్మ తాతయ్యలు చేరదీశారు. వారి బాగోగులు చూశారు. ఆరు నెలలవరకు సాఫీగా గడిచింది. ఇద్దరు పిల్లలు హస్టళ్లలో ఉంటూ చదువుకున్నారు.
బతుకు భారమైంది..'ఈటీవీ భారత్' ఆసరాగా నిలిచింది - ఆదాయం లేక.. బియ్యం రాక...
చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన అక్కాతమ్ముళ్లకు అమ్మమ్మ తాతయ్యనే అమ్మానాన్న అయి సాకుతున్నారు. ఎనిమిది పదుల వయస్సులో... వారు బతకటమే గగనమైన సమయంలో ఆ చిన్నారుల పోషణ మోయలేని భారంగా మారింది. కనీసం రేషన్‌కార్డు కూడా లేకపోవటం వల్ల మరింత క్లిష్టంగా మారిన వారి పరిస్థితి తెలుసుకుని... 'ఈటీవీ భారత్' ఆదుకుంది. ఈటీవీ రజతోత్సవ వేళ వారి ముఖాల్లో చిరునవ్వు పూయించింది.
కడు పేదరికంలో బతుకు వెళ్లదీస్తున్న ఆ వృద్ధులకు కళ్లు సరిగా కనిపించవు. తాతకు కాలు విరిగి ఏమీ పనిచేయలేని స్థితిలో ఉన్నాడు. కరోనా మహమ్మరి ఆ కుటుంబాన్ని మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. వృద్ధులకు ఎలాంటి ఆదాయం లేకపోవటం వల్ల పోషణ భారంగా మారింది. వృద్ధ దంపతులకు రేషన్ కార్డు కూడా లేకపోవటం వల్ల వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రస్తుతం ఎలాంటి ఆదాయం లేక.. అటు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం రాక... పూట గడవటమే కష్టంగా తయారైంది. ప్రభుత్వమే దయతలచి పిల్లలు, వృద్ధులను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
దాతృత్వం చాటుకున్న ఈటీవీ భారత్...
ఈటీవీ భారత్ వారికి ఆసరానిచ్చింది. కష్టాల్లో వారికి కాస్త బాసటగా నిలిచింది. ఈటీవీ రజతోత్సవం సందర్భంగా వారిని ఆదుకోవాలని భావించింది. కల్యాణ లక్ష్మీ దుస్తుల దుకాణంతో మరికొందరి ప్రోత్సాహం కోరింది. ఆ కుటుంబానికి వంద కిలోల బియ్యం, నిత్యవసర సరకులు, పిల్లలకు దుస్తులు, రూ.2 వేల నగదు అందించింది.