దేశంలోనే అత్యున్నత వైద్య ప్రమాణాలకు చిరునామాగా నిలిచే దిల్లీ ఎయిమ్స్ స్థాయిలో.... బీబీ నగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని డైరెక్టర్ వికాస్ భాటియా స్పష్టం చేశారు. ఎనిమిదేళ్లుగా భువనేశ్వర్ ఎయిమ్స్ డీన్‌గా పనిచేస్తున్న ఆయనను.... బీబీనగర్ ఎయిమ్స్ పూర్తి కాలపు తొలి డైరెక్టరుగా కేంద్ర వైద్యారోగ్య శాఖ నియమించింది. ఐదేళ్లలో వైద్యులకార్ఖానాగా ఎయిమ్స్‌ను తీర్చిదిద్ది.... ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామంటున్న వికాస్ భాటియాతో మా ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.
ఓపీ సర్వీసులను ఎప్పుడు ప్రారంభిస్తారు...?
ప్రస్తుతం ఇక్కడ దాదాపు పది విభాగాలకు వైద్యులున్నారు. మౌలిక వసతులున్నాయి. లాక్‌డౌన్ ముగియగానే ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రోగులకు మందులు సైతం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశంలో ఏ ఎయిమ్స్‌కూ లేని రవాణా, మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్‌కు దూరంగా పచ్చని ప్రకృతి మధ్య దీన్ని నిర్మించడం విశేషం. ఒకటి రెండేళ్లలో పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. మౌలిక వసతుల కల్పన పూర్తయ్యాక మొత్తం 58 విభాగాలకు సంబంధించిన కోర్సులను ప్రారంభిస్తాం. ప్రస్తుతం 50 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేంద్రం అనుమతితో 125 సీట్లు భర్తీ చేస్తాం. లాక్‌డౌన్ ముగియగానే ఈ ఏడాది సకాలంలో తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం.
కరోనా కేసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
ప్రస్తుత కరోనా ప్రపంచంలో వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు భాగమవ్వాలి. పరిశోధన, నూతన ఆవిష్కరణలపై మేం ఎక్కువ దృష్టి పెడతాం. అకడమిక్స్, సేవ, బోధన, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ ఈ అయిదింటినీ ప్రాధాన్యాంశాలుగా గుర్తించి ఎయిమ్స్ పురోగతి ఈ దిశగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బందికి అవసరమైన భవనం, వసతిగృహాలను త్వరలోనే సిద్ధం చేస్తాం.