భక్తి దాహంతో దైవ దర్శనానికి వచ్చిన వారికి తాగు నీటి దాహం వెంటాడుతోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో తాగునీటి వసతి లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండపైన ఉన్న ఒకే ఒక కొళాయి చాలా మందికి కనబడకుండా ఉంది. చూసిన వారెవరైనా నీరు తాగుదామని వెళ్తే అపరిశుభ్రంగా ఉండడం వల్ల తాగడానికి జంకుతున్నారు.
లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ఈనెల ఎనిమిది నుంచి యాదాద్రికి భక్తుల రాక మొదలైంది. పరిమిత సంఖ్యలో ఆటోలు, బస్సుల్లో, కొండ పైకి చేరుతున్నారు. చాలా మంది ఘాట్రోడ్డులో నడుచుకుంటూ వస్తున్నారు. తడారిపోయిన గొంతు తడుపుకుందామంటే చుక్కనీరు దొరకని పరిస్థితి. లాక్డౌన్కు ముందు కొండ పైన దుకాణాల్లో శీతల పానీయాలు, మంచి నీళ్ల బాటిళ్లు విక్రయించేవారు. ప్రస్తుతం దుకాణాలు తెరవకపోవడం వల్ల కొండపైన నీరు దొరకని పరిస్థితి. కొండపైన తాగునీటి వసతి కల్పించాలని భక్తులు కోరుతున్నారు.