కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి తెరాస టిక్కెట్ ఇవ్వొద్దంటూ.. మునుగోడు నియోజకవర్గం తెరాస అసమ్మతి నేతలు మరోసారి సమావేశమయ్యారు. చౌటుప్పల్‌లో జరిగిన ఈ భేటీలో సుమారు 80 మంది ప్రజాప్రతినిధులు తెరాస మునుగోడులో గెలవాలంటే... కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దని మూకమ్మడి తీర్మానం చేశారు. టికెట్ ఇస్తే ఓడిస్తామని అసమ్మతి నేతలు స్పష్టం చేశారు.
కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటున్న తెరాస అసమ్మతి నేతలు - మునుగోడు ఉప ఎన్నికలు
మునుగోడు టికెట్ విషయంలో తెరాసకు తలనొప్పులు తప్పేలా లేవు. విషయం ప్రగతి భవన్ వరకు చేరినా.. గులాబీ తమ్ముళ్లు కూసుకుంట్ల విషయంలో గుర్రుగానే ఉన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి బుజ్జగించినా.. కేసీఆర్ సభకు ఏర్పాట్లు జరుగుతున్నా.. కూసుకుంట్లకు కాకుండా వేరే వారికి టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ చౌటుప్పల్‌లో సమావేశమై.. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడిస్తామని హైకమాండ్‌కు తేల్చిచెప్పారు.
ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే తెరాస గెలిచే అవకాశం లేదని, కార్యకర్తల్లో తీవ్రమైన వ్యతిరేక వున్నదని తెరాస అసమ్మతి నేతలు స్పష్టం చేసారు. ఇదే విషయాన్ని వారం క్రితం కూడా జిల్లా ఇంఛార్జ్ మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి చెప్పినట్లు తెలిపారు. అయినా కూడా ఆయనకే టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోవడం ఖాయమని చెబుతున్నారు. అసమ్మతి గళాన్ని చల్లబరిచేందుకు జగదీశ్వర్‌రెడ్డి ఇప్పటికే ఓసారి వారితో సమావేశమయ్యారు. అయినా కూడా స్థానిక నేతలు కూసుకుంట్లపై గుర్రుగానే ఉన్నారు. ఈ అసంతృప్తి వ్యవహారం ఇప్పటికే ప్రగతి భవన్‌కు కూడా చేరింది.
మరోవైపు మునుగోడు ఉపఎన్నికల పోరుకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. ఈ నెల 20న కేసీఆర్‌తో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ మంత్రి జగదీశ్‌రెడ్డి.. మునుగోడు, చండూరు, సంస్థాన్ నారాయణపురంలో స్థలపరిశీలన చేశారు. మునుగోడు ప్రజాదీవెన పేరుతో లక్ష మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20న మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ సభను విజయవంతం చేసేందుకు మండలాల వారీగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించారు. అప్పటిలోగా ఈ అసమ్మతి వ్యవహారాన్ని కూడా చల్లబరచాలని ఆయన భావిస్తున్నారు.