Diesel from Plastic Waste : ఇంజినీరింగ్‌లో రాణించి మంచి ఉద్యోగాలు అందుకున్నారు ఈ యువకులు. కానీ పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆర్థిక కష్టాలు దాటి.. ఏళ్ల పాటు శ్రమించి ప్లాస్టిక్ వ్యర్థాలతో డీజిల్ తయారీ పరిశ్రమ ప్రారంభించారు. ప్రస్తుతం లాభాలతో ముందుకెళ్తూ.. అందరి ప్రశంసలు, మన్ననలు పొందుతున్నారు రంజిత్‌రెడ్డి, దినేశ్ రెడ్డి. ఈ యువకులు ఒకరు మెకానికల్, మరొకరు కంప్యూటర్ ఇంజినీర్. ఇద్దరూ లండన్‌లో మాస్టర్స్ చేశారు. అక్కడే ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. మాతృ భూమికి, పర్యావరణ రక్షణ, స్థానికులకు ఉపాధి కల్పించేలా ఏదైనా పరిశ్రమ స్థాపించాలని భావించారు. ఆ సమయంలోనే రీసైకిల్ చేయడానికి వీల్లేని మల్టీలేయర్ పాలిథిన్ వ్యర్థాలతో డీజిల్ ఉత్పత్తి చేసే పరిశ్రమ గురించి తెలుసుకున్నారు.
ఏడుతోనే బడి బంద్.. ప్లాస్టిక్, పాలిథీన్‌తో పెట్రోల్.. లీటర్‌కు 50కి.మీ మైలేజ్!
Diesel Making from Plastic Waste : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో 'సహస్ర ఎన్విరో' పేరుతో చిన్నగా పరిశ్రమ నెలకొల్పారు. అందుకోసం సొంతగా కొంత మెుత్తంతో పాటు స్నేహితులు, బ్యాంకుల నుంచి రూ.8 కోట్లు పెట్టుబడి రుణాలు తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాలిథిన్ వ్యర్థాల నుంచి డీజిల్‌ను ఉత్పత్తి చేసే యంత్రం రూపొందించారు. అలా మొదట రోజుకు 500 కిలోల పాలిథిన్ వ్యర్థాలు మరిగించి డీజిల్ తయారు చేయటం మెుదలు పెట్టారు.
రోడ్లపై చెత్త ఏరుకునే వాళ్ల నుంచి, వ్యర్థాలను అమ్మే ఏజెంట్ల నుంచి రీసైక్లింగ్‌కు అవకాశం లేని పాలిథిన్, ప్లాస్టిక్ వ్యర్థాలు కొనుగోలు చేసేవాళ్లు. వాటిని రియాక్టర్లలో ఆక్సిజన్ లేకుండా వేడి చేస్తే.. పాలిథిన్ కరిగి వాయువు రూపంలోకి మారుతుంది. ఆ వాయువును చల్లబరిస్తే డీజిల్ తయారవుతుంది. ఇలా రోజుకు 10 టన్నుల పాలిథిన్ వ్యర్థాలతో 6000 లీటర్ల డీజిల్‌ను ఉత్పత్తి చేస్తున్నామని చెబుతున్నారు.