యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రత్యేక దృష్టితో స్థానిక ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రి ఆవరణలో దాతలు భగవాన్ మహావీర్ జైన్ ట్రస్ట్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేయించారు. దాతలు అందించిన రూ.30 లక్షల వ్యయంతో అధునాతన భవనాన్ని నిర్మించారు. 10 పడకల సామర్థ్యంతో ఏర్పాటైన ఈ కేంద్రంలో మూత్రపిండ వ్యాధిగ్రస్థులకు డయాలసిస్ సేవలు అందుతాయి.
రేపు ఆలేరులో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రులు - భగవాన్ మహావీర్ జైన్ ట్రస్ట్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో భగవాన్ మహావీర్ జైన్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటైన డయాలసిస్ కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు ఉదయం పదిన్నర గంటలకు మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డిలు ప్రారంభించనున్నారు.
మొదటగా ఆరు పడకలను ఏర్పాటు చేయగా.. అనంతరం మిగతా నాలుగు పడకలను ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క రోగికి డయాలసిస్ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో ఒక బెడ్‌పై రోజుకు ముగ్గురు రోగులకు డయాలసిస్ సేవలు అందుతాయి. ఈ క్రమంలో మొత్తం ఆరు బెడ్లపై రోజుకు 18 మంది మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు డయాలసిస్ సేవలు అందనున్నాయి.
ఇందుకు అవసరమైన యంత్రాలు, వైద్యులు, సాంకేతిక సిబ్బంది, ఇతరత్రా అవసరాలు భగవాన్ మహావీర్ జైన్ ట్రస్ట్ పర్యవేక్షణలో కొనసాగుతాయి. డయాలసిస్ ప్రక్రియకు అవసరమయ్యే స్వచ్ఛమైన నీటి కోసం ప్రత్యేకంగా నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మిగతా అవసరాల కోసం మిషన్ భగీరథ నీటిని అందుబాటులో ఉంచారు. ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు ఎమ్మెల్యే గొంగిడి సునీత అధ్యక్షతన జరగనున్న కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొని డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు.
ఇవీ చూడండి: మూసీ సుందరీకరణకు ప్రణాళికలు రూపొందించండి: మంత్రి కేటీఆర్