Devotees Rush In Yadadri: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాకతో యాదగిరీశుని సన్నిధి భక్తులతో రద్దీగా మారింది. క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి.. కిటకిటలాడుతున్నాయి. స్వామి వారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా భక్తులకు లఘు దర్శన సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రధానాలయంలో ఉదయం నుంచి ఆరాధనలు, స్వామివారి నిత్యకైంకర్యాలను అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి:కాగా స్వయంభువుల దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. తాగునీరు సౌకర్యం ఉన్నా వేసవి కావడంతో నల్లాల ద్వారా వస్తున్న వేడి నీరు తాగలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ మాడ వీధుల్లోనూ సరిపోను తడకల పందిర్లు లేకపోవడంతో భానుడి తాపానికి భక్తులు తట్టుకోలేకపోతున్నారు. ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు సతమతమవుతున్నారు.
'ఉదయం 7 గంటలకు బయల్దేరి వచ్చాము. దాదాపు మూడు గంటలకు పైగా నిల్చొనే ఉన్నాం. మా వయసును దృష్టిలో పెట్టుకుని అయినా వృద్ధులను పంపించడం లేదు. అడిగితే పట్టించుకోవడం లేదు. దాహార్తిని తీర్చుకునేందుకు నీళ్లు తాగుదామన్నా.. నల్లాల నుంచి వేడి నీళ్లే వస్తున్నాయి. కనీస సదుపాయాలు కూడా లేవు. చిన్నపిల్లలు తట్టుకోలేకపోతున్నారు.' -భక్తుడు
వీఐపీలకే సకల మర్యాదలు: మరోవైపు యాదాద్రికి వచ్చే వీఐపీలకే సకల మర్యాదలు చేపడుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కనీసం మౌలిక సదుపాయాలైనా సరిగా కల్పించడం లేదని ఆవేదన చెందుతున్నారు.