తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri: యాదాద్రిలో భక్తుల అవస్థలు.. సదుపాయాలు లేవని గగ్గోలు - Devotees problems in Yadadri temple

Devotees problems in Yadadri: యాదాద్రి పునఃప్రారంభం తర్వాత యాదాద్రీశుని నిజరూప దర్శనం చేసుకుని తరించాలనుకునే భక్తులకు.. చేదు అనుభవమే ఎదురవుతోంది. మూలమూర్తుల దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. దీంతో కనీస సదుపాయాలు, పర్యవేక్షణ లేక భక్తులు సతమతమవుతున్నారు. అసలే మండే ఎండలు.. ఆపై చిన్న పిల్లలతో కొండకు చేరుకున్న భక్తులకు తాగేందుకు సైతం మంచినీళ్లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

devotees problems in yadadri
యాదాద్రిలో భక్తుల ఇబ్బందులు

By

Published : Apr 4, 2022, 2:36 PM IST

Devotees problems in Yadadri: యాదాద్రిలో సౌకర్యాలు లేవని భక్తులు గగ్గోలు పెడుతున్నారు. కనీసం నిలువనీడ లేదని.. తాగేందుకు మంచినీళ్లు లభించడం లేదని గోడు వెల్లబోసుకుంటున్నారు. యాదాద్రి పునఃప్రారంభం తర్వాత భక్తులు గుట్టకు భారీగా తరలిస్తున్నారు. శని, ఆదివారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్షేత్ర పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఆదివారం యాదగిరిగుట్టకు పసిపాపలతో వచ్చిన భక్తులు ఆలయ నిర్వహణ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. భానుడి భగభగకు తోడు.. మార్గదర్శనం, పర్యవేక్షణ లేకపోవడంతో స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

క్యూలైన్లలో కనీసం ఫ్యాన్లు కూడా లేకపోవడం వల్ల.. ఎండవేడికి తాళలేక పిల్లలు ఉక్కిరిబిక్కిరి అయ్యారని భక్తులు వాపోయారు. సదుపాయాలు లేనప్పుడు దర్శనాలు ఎందుకు కల్పించారంటూ.. ఆలయ ప్రాంగణంలో కనిపించిన ఏఈవోలు, పర్యవేక్షకులను ప్రశ్నించారు. భక్తులు తోసుకోవడంతో ప్రసాదాల విభాగంలో జాలి ఊడిపడింది. క్యూలైన్ల షెడ్డులో తాళం వేసే గొల్లాన్నీ ఊడగొట్టారు. పరిధికి మించి బస్సుల్లో యాత్రికులను తరలిస్తున్నారని.. ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యతని నిలదీశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

కొండపై సౌకర్యాలు లేవని భక్తుల గగ్గోలు

ఇదీ చదవండి:రైతుల ఆగ్రహాన్ని దిల్లీ పాలకులకు చూపిస్తాం..: 'రైతు దీక్షలో' తెరాస నేతలు

ABOUT THE AUTHOR

...view details