Devotees Crowd at Yadadri Temple : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి యాదాద్రీశ్వరుడిని దర్శించుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి కార్లు, బస్సులు ప్రత్యేక వాహనాలలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోందని భక్తులు తెలిపారు. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
లక్ష్మీనరసింహ నామస్మరణతో యాదగిరి గుట్ట ప్రతిధ్వనిస్తోంది. ప్రసాదం కౌంటర్లు, నిత్య కల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. పార్కింగ్ స్థలంలో రద్ధీ దృష్ట్యా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
యాదాద్రిలో 'యాదరుషి నిలయం' చూశారా?:నాడు ముళ్లకంపలు.. బండరాళ్లు.. చెత్తతో చిందరవందరగా, ఎత్తుపల్లాలుగా ఉన్న పెద్దగుట్ట అది. యాదాద్రిలోని ఆ ప్రాంతమంతా నేడు ఆలయ నగరిగా రూపుదిద్దుకుంటోంది. అక్కడే విశాల రహదారులు, ఆహ్లాదకర పచ్చదనంతో ఆకట్టుకునేలా సరికొత్త కుటీరం సిద్ధమైంది. యాదాద్రి క్షేత్రం ఆవిర్భావానికి మూలమైన యాదవ మహర్షి పేరిట ‘యాదరుషి నిలయం’ నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, సీఎం కేసీఆర్ సంకల్పంతో క్షేత్రాభివృద్ధికి పాటుపడుతున్న వైటీడీఏ రూ.3 కోట్లతో దీన్ని తీర్చిదిద్దింది.