Cross Voting Fear in Munugode bypoll: మునుగోడు ఉపఎన్నికలో ప్రధానపార్టీలకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. తమ వెంటే రాత్రింబవళ్లు తిరుగుతున్న కొందరు నేతలు అంతర్గత సమావేశాల్లో ఎదుటి పార్టీకే ఓటేయాలని సంభాషిస్తున్న ఉదంతాలు వెలుగుచూడటంతో ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు. పార్టీలన్ని ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం సహా బయటివారిని ఇన్‌ఛార్జులుగా నియమించడం, వారే చేరికలపై నిర్ణయం తీసుకోవడం వల్లే ఈపరిస్థితి తలెత్తిందనే అభిప్రాయం అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.
ఓ ముఖ్యనేత మంత్రాంగంతో ప్రధాన పార్టీ అభ్యర్థికి అనుంగు అనుచరులుగా కొందరు ఇటీవలే పార్టీలో చేరారు. అయినా సదరు అభ్యర్థితో ఉన్న అనుబంధందృష్ట్యా వారంతా ఆయన గెలుపునకే కృషిచేస్తున్నట్టు రెండ్రోజుల క్రితం గుర్తించిన ముఖ్యనేత వర్గాలు అవాక్కయ్యాయి. చౌటుప్పల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రధాన పార్టీ సర్పంచి ఇటీవల మరో పార్టీలోకి చేరగానే ఆయన్ను ఆ పార్టీ ఓగ్రామానికి ఇన్‌ఛార్జిగా నియమించింది.
ఓటు మాత్రం ప్రధాన పార్టీకే: ఒత్తిళ్లతో పార్టీమారాల్సి వచ్చిందని ఓటు మాత్రం ప్రధాన పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికే వేయాలని’అంతర్గత సంభాషణల్లో చెబుతున్నట్టు వేగులు గుర్తించారు. ఆ వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయని.. చివరికి తమ వెంట ఎప్పట్నుంచో ఉండేవారినీ అనుమానించాల్సి వస్తోందని ఓ ముఖ్య పార్టీ అభ్యర్థి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానాన్ని మెప్పించే క్రమంలో కొందరు నేతలు రాత్రికిరాత్రే ప్రత్యర్థి వర్గాల వారికి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటున్నారు.
లోపాయికారీగా సొంత పార్టీ కోసం: భారీగా డబ్బు ముట్టజెపుతుండటంతో పార్టీలో చేరేందుకు ఆసక్తిచూపుతున్నారు. కొందరు వ్యూహం ప్రకారమే ప్రత్యర్థిపార్టీలో చేరి.. వారి లోసుగులను లోపాయికారీగా సొంత పార్టీ కోసం పనిచేస్తున్నారు. వాళ్ల వల్ల నష్టం జరుగుతుందని తెలిసినా ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని ఓ కీలక నేత వాపోయారు. పోలింగ్ సమయం దగ్గరపడుతున్నకొద్దీ కోవర్టులు, క్రాస్‌ఓటింగ్ భయం పెరుగుతోందేయోనని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
ఆయా పార్టీలకే ఓటేసేలా ఒప్పందం: అన్నిమండలాల్లో వారం నుంచి మహిళా సంఘాల సభ్యులు ఎక్కడికక్కడ సమావేశమవుతూ.. ఆ మండల, ప్రాంత ప్రధాన పార్టీల ఇన్‌ఛార్జులకు వేర్వేరుగా సమాచారం ఇస్తున్నారు. ఎవరికి వారు మహిళల డిమాండ్లు అంగీకరించి ఆయా పార్టీలకే ఓటేసేలా ఒప్పందం చేసుకొని వెళ్తున్నారు. తమతో మాత్రమే కాదని ప్రత్యర్ధి పార్టీలతో ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలుసుకున్న పార్టీల ప్రతినిధులు నోరెళ్లబెడుతున్నారు.