బీజేపీ అప్రజాస్వామిక చట్టాలను ఎదుర్కోవడంలో, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించటంలో బీఆర్ఎస్ సఫలం అయిందని.. అందుకే రానున్న కాలంలో ఆ పార్టీతో వెళ్లనున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రహదారి బంగ్లాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని తమ్మినేని వ్యాఖ్యానించారు. బీజేపీ తెలంగాణలో పాగా వేయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తోందని.. ప్రలోభాలకు పాల్పడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకుంటామని అందుకోసం ప్రత్యేకంగా కమిటీ వేసుకోవడం బీజేపీ వ్యభిచార రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు.
తమ మాట వినని వారిపై ఈడీ, సీబీఐ పేరిట భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తమ్మినేని ఆరోపించారు. తాజాగా ఖమ్మంలో ఓ ప్రధాన నాయకుడినీ బీజేపీలో చేర్చుకునేందుకు బీజేపీ పార్టీ సిద్దమైందని విమర్శించారు. బీజేపీ వ్యతిరేక శక్తిగా ఉన్న బీఆర్ఎస్తో సీపీఐ, సీపీఎం పార్టీలుగా కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఓడించే శక్తి లేదని మునుగోడులో స్పష్టం అయిందని అన్న ఆయన.. బీజేపీకి వ్యతిరేక శక్తిగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాలు, పోరాటాలు వేర్వేరని మరోసారి ఆయన స్పష్టం చేశారు. బీజేపీ పార్టీని ఓడించడం తమ ప్రధాన లక్ష్యమని.. దానికోసం ఏ పార్టీకైనా మద్దతిస్తామని స్పష్టం చేశారు.