రెవెన్యూ కార్యాలయాల్లో సామాన్య ప్రజలు పడే బాధలను అతిదగ్గరి నుంచి చూసిన ఆ యువజంట వేర్వేరు లక్ష్యాలతో గ్రూపు-2 పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఎలాంటి కోచింగ్ అవసరం లేకుండానే టీఎస్పీఎస్సీ గ్రూపు-2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సాధించిన తొలిదంపతులుగా నిలిచారు. వాళ్లే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పైళ్ల నవీన్ రెడ్డి-అనూష దంపతులు.
ప్రజలకు సాయం చేయాలనే ఆశయంతో...
యాదాద్రి భువనగిరి జిల్లా సుంకిశాలకు చెందిన పైళ్ల నవీన్ రెడ్డి, తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి చెందిన అనూష 2019 ఫిబ్రవరిలో వివాహబంధంతో ఒకటయ్యారు. పెళ్లికి ముందు వీరిద్దరి లక్ష్యాలు వేరుగా ఉండేవి. నవీన్ రసాయన శాస్త్రంలో పీహెచ్డీ చేయగా అనూష ఐఏఎస్ అవ్వాలని సివిల్స్‌కు సన్నద్ధమయ్యేది. ప్రజలకు అందుబాటులో ఉండే ఉద్యోగం సంపాదించాలనే కసి ఇద్దర్లోనూ ఉండేది. ఆ సమయంలో 2016లో గ్రూపు-2 నోటిఫికేషన్ వచ్చింది.
ఫలితాల్లో జాప్యం వల్ల వేరే కొలువులు
ఫలితాల్లో జాప్యం జరిగినందున నవీన్‌రెడ్డి ఎస్సై పరీక్షలు, అనూష ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. అనూష అసోంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా శిక్షణ తీసుకుంటుండగా కుటుంబ సభ్యులు నవీన్‌తో వివాహం నిశ్చయం చేశారు. పెళ్లైన కొద్దిరోజులకే విడుదలైన టీఎస్పీఎస్సీ గ్రూపు-2 ఫలితాల్లో వీరిద్దరూ ఇంటర్వూకు ఎంపికయ్యారు.