గ్రీన్ జోన్ పరిధిలో ఉన్న యాదాద్రి జిల్లాలో కరోనా కేసులు కంగారు పెడుతున్నాయి. ముంబయి నుంచి జిల్లాకు తిరిగి వచ్చిన వలస కూలీలు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. నాలుగు మండలాల పరిధిలో 16 మంది కూలీల్లో వైరస్ బయటపడింది. ఆత్మకూరు(ఎం) మండలంలో 8, చౌటుప్పల్ పురపాలిక పరిధిలో నాలుగు, సంస్థాన్ నారాయణపురంలో మూడు, మోటకొండురులో ఒకరి చొప్పున కొవిడ్ నిర్ధరణ అయింది. వైరస్ విస్తరించకుండా ఆయా మండలాల్లో పోలీసులు, అధికారులు రక్షణాత్మక చర్యలు చేపడుతున్నారు. అనుమానితుల్లో కొందర్ని ఇప్పటికే హైదరాబాద్, బీబీనగర్ ఎయిమ్స్ క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
బీబీనగర్ ఎయిమ్స్‌కు తరలింపు
ఆత్మకూరు, మోటకొండూరుకు చెందిన వలస కూలీలు మినహా మిగతా వారెవరూ జిల్లాలోకి ప్రవేశించలేదు. అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మోటకొండూరు పాజిటివ్ బాధితురాలు... ఆమె భర్త, ఇద్దరు పిల్లలతో ఈ నెల 9న రాత్రి నాందేడ్ నుంచి వచ్చారు. ఆ నలుగురితోపాటు మరో ముగ్గుర్ని ఈ నెల 10న క్వారంటైన్ తరలించారు. పరీక్షల్లో ఆమె ఒక్కరికే పాజిటివ్ రాగా.. ఆమె కుటుంబ సభ్యులు సహా 13 మందిని బీబీనగర్ ఎయిమ్స్‌కు తరలించారు. ఆత్మకూరు మండలానికి సంబంధించి మంగళవారం వరకు 13 మందిని హైదరాబాద్ తరలించగా.. 8 మందికి పాజిటివ్ వచ్చింది. వారి కాంటాక్టులకు సంబంధించి.. 36 మందిని ఇప్పటికే హోం క్వారంటైన్ చేశారు. తాజాగా మరో 13 మందిని తరలించారు. ఆత్మకూరు నుంచి నలుగురు, ఇప్పల్ల నుంచి ముగ్గురు, కొరటికల్, పారుపల్లి గ్రామాల నుంచి ఇద్దరు చొప్పున, రేగులకుంట, పోతిరెడ్డిపల్లి నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 13 మందిని క్వారంటైన్కు పంపారు.